తెలియక చేసినా చెల్లించక తప్పదు భారీ మూల్యం! జన విశ్వాస్ చట్టం!
New Railway Rules: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనవిశ్వాస్ చట్టంతో రైల్వేలలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చిన్న ఉల్లంఘనలకు గతంలో ఉన్న జైలు శిక్షలను పూర్తిగా రద్దు చేసి భారీ జరిమానాలను అమలు చేస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులకు సైతం స్పాట్ ఫైన్లు వేసే అధికారాలు కల్పించారు. రిజర్వ్డ్ బోగీల్లో అక్రమ ప్రవేశానికి రూ. 2,000, సరకు రవాణా ఉల్లంఘనలకు రూ. 10,000 వరకు ఫైన్లు నిర్దేశించారు.
- రిజర్వ్డ్ బోగీల్లో అక్రమ ప్రవేశం: అనుమతి లేకుండా ఎక్కితే ఏకంగా రూ. 2,000 పెనాల్టీ!
- మహిళలు, దివ్యాంగుల కోటా ఉల్లంఘన: ప్రత్యేక బోగీల్లోకి పురుషులు వెళ్తే ఫైన్ల మోత!
- బెర్త్ ఆక్రమిస్తే రూ. 1,000 ఫైన్: సీటు ఖాళీ చేయని ప్రయాణికులకు రైల్వే గట్టి షాక్!
Travel: రైలు ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా 'జనవిశ్వాస్ చట్టాన్ని' అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రయాణికులకు అనవసరమైన వేధింపులను అరికట్టడంతో పాటు రైల్వే వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కీలక సంస్కరణలు చేపట్టారు. చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలకు గతంలో ఉన్న జైలు శిక్షలను రద్దు చేసి, వాటి స్థానంలో అపరాధ రుసుములను (భారీ జరిమానాలు) వర్తింపజేస్తూ చట్టపరమైన మార్పులు చేశారు.
ఆర్పీఎఫ్ పోలీసులకు నేరుగా ఫైన్లు విధించే అధికారం
ఇప్పటివరకు కేవలం టికెట్ తనిఖీ అధికారులు (టీటీఈలు) మాత్రమే జరిమానాలు విధించే అధికారం కలిగి ఉండేవారు. కానీ తాజా సంస్కరణల ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులకు కూడా స్పాట్‌లోనే జరిమానాలు విధించే అదనపు అధికారాలను కల్పించారు. రైల్వే ఆస్తుల రక్షణతో పాటు ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ఆర్పీఎఫ్ సిబ్బందికి మార్గదర్శకాలను జారీ చేశారు. ఇకపై తప్పు జరిగితే ఆర్పీఎఫ్ పోలీసులు నేరుగా చర్యలు తీసుకుంటారు.
బోగీల్లో అక్రమ ప్రవేశం – రిజర్వేషన్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం
రైళ్లలో ప్రయాణించే పౌరుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని జరిమానాలను స్పష్టంగా వర్గీకరించారు. దివ్యాంగులు లేదా మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లోకి అనుమతి లేకుండా పురుషులు ప్రవేశిస్తే రూ. 200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేయించుకోకుండా అక్రమంగా రిజర్వ్డ్ బోగీల్లోకి ప్రవేశిస్తే ఏకంగా రూ. 2,000 పెనాల్టీ విధిస్తారు. ఒకరి బెర్త్‌ను మరొకరు బలవంతంగా ఆక్రమించుకుని ఖాళీ చేయకపోతే రూ. 1,000 వరకు ఫైన్ విధిస్తారు.
న్యూసెన్స్, ధూమపానంపై కఠిన ఆంక్షలు – కమ్యూనిటీ సర్వీస్
రైళ్లు లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో ధూమపానం చేసినా, అనధికారికంగా వ్యాపారాలు చేసినా, యాచించినా రూ. 2,000 చొప్పున జరిమానా తప్పదు. మద్యం సేవించి తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినా, గొడవలకు దిగినా రూ. 1,000 జరిమానాతో పాటు శిక్షగా రైల్వే ప్రాంగణాల్లో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తారు. టికెట్ లేకుండా ప్రయాణించినా లేదా పరిమితి దాటి ప్రయాణించినా టికెట్ చార్జీతో పాటు కనీసం రూ. 500 అదనపు పెనాల్టీని ఆర్పీఎఫ్ వసూలు చేస్తుంది.
ప్రమాదకర సరకుల రవాణాకు రూ. 10,000 భారీ పెనాల్టీ
సరకు రవాణా భద్రత మరియు రైల్వే ఆస్తుల సంరక్షణ విషయంలోనూ నిబంధనలను కఠినతరం చేశారు. సరకు రవాణా చేసే వ్యాపారులు తప్పుడు వివరాలను నమోదు చేసినా, అగ్నిప్రమాదాలకు దారితీసే లేదా పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించినా ఏకంగా రూ. 10,000 భారీ అపరాధ రుసుము విధిస్తారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే రూ. 2,500 జరిమానా విధిస్తారు. రైల్వే హెచ్చరిక బోర్డులను ధ్వంసం చేస్తే మొదటిసారి తప్పుకు రూ. 2,000 ఫైన్ విధిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ప్రయాణికులు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి
రైల్వే వ్యవస్థలో క్రమశిక్షణను కాపాడటమే ఈ కొత్త రూల్స్ ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చిన్నపాటి తప్పుల వల్ల ఎదురయ్యే కోర్టు, జైలు శిక్షల భయం తప్పినప్పటికీ, భారీ జరిమానాల భారం ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేలా ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ ఈ నూతన జనవిశ్వాస్ చట్టంపై పూర్తి అవగాహన పెంచుకుని, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం సాగించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
Tags
Be the first to react