పర్యాటకులకు ప్రమాదకరంగా మారిన జపాన్ ఫేమస్ జింకల పార్క్.. రికార్డు స్థాయిలో దాడులు!
Deer Attacks Hit Record High: జపాన్‌లోని నారా పార్క్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ సందర్శకులతో స్నేహంగా మెలిగే జింకలు ఈ పార్క్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఇప్పుడు అవే జింకలు పర్యాటకులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆహారం పెట్టేందుకు వచ్చే సందర్శకులపై దాడులు చేస్తుండటంతో గాయపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు జింకల దాడుల్లో 51 మంది ఆసుపత్రి పాలవగా, వారిలో సుమారు 70 శాతం మంది విదేశీ పర్యాటకులే కావడం ఆందోళన కలిగిస్తోంది.
జపాన్‌లో పర్యాటకులపై దాడి చేస్తున్న జింకలు.. ఈ ఏడాది 51 మందికి గాయాలు, 70 శాతం విదేశీయులే..
ఆహారం పెడితే దాడి చేస్తున్న జింకలు.. జపాన్‌లో పర్యాటకులకు హెచ్చరిక..
జపాన్‌లోని నారా పార్క్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ సందర్శకులతో స్నేహంగా మెలిగే జింకలు ఈ పార్క్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఇప్పుడు అవే జింకలు పర్యాటకులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆహారం పెట్టేందుకు వచ్చే సందర్శకులపై దాడులు చేస్తుండటంతో గాయపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు జింకల దాడుల్లో 51 మంది ఆసుపత్రి పాలవగా, వారిలో సుమారు 70 శాతం మంది విదేశీ పర్యాటకులే కావడం ఆందోళన కలిగిస్తోంది.
నారా పార్క్‌లో వందల సంఖ్యలో జింకలు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి. సందర్శకులు వాటికి ఆహారం అందించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బియ్యం, గోధుమలతో కూడిన 'షికా సెన్బే' (Shika Senbei) క్రాకర్లను పార్క్ పరిసరాల్లోని విక్రయదారుల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ క్రాకర్లను చేతులతో అందిస్తుండటంతో జింకలు పర్యాటకుల దగ్గరకు వచ్చి ఆహారం తీసుకుంటాయి. ఈ దృశ్యాలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ జింకలు ప్రశాంతంగా ఉంటాయని చెప్పలేం. ముఖ్యంగా చేతిలో క్రాకర్లు పట్టుకుని వాటికి వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేస్తే జింకలు అసహనంతో ప్రవర్తిస్తున్నాయి.
ఆహారం కోసం ఎదురుచూస్తూ కొన్నిసార్లు సందర్శకుల దుస్తులు, బ్యాగులను లాగడం, కొరకడం, తన్నడం, ఒక్కసారిగా మీదకు దూసుకురావడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. క్రాకర్లు చేతిలో కనిపిస్తే వాటిని తీసుకునేందుకు జింకలు దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు తీవ్రంగా గాయపడుతూ ఆసుపత్రులకు చేరుతున్నారు.
జపాన్ టుడే (Japan Today) కథనం ప్రకారం, నవంబర్ 5 నాటికి జింకల దాడుల్లో గాయపడిన 51 మందికి నారా మున్సిపల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వీరిలో ఎక్కువమందిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విదేశీ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంది. నారా పార్క్ జింకల కారణంగా ఆసుపత్రికి చేరిన వారి సంఖ్యలో ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. గత రెండేళ్లలో ఈ సంఖ్య 40 లోపే ఉండగా, 2023లో అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించిన వారి సంఖ్య కేవలం 23 మాత్రమే. ఈ ఏడాది ఆ సంఖ్య 51కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు పార్క్‌లో జింకల సంఖ్య కూడా అధికం కావడం ఈ ఘటనలకు ప్రధాన కారణమని జపాన్‌కు చెందిన టీవీ అసాహి (TV Asahi) పేర్కొంది. ఈ ఏడాది జూలైలో నారా డీర్ ప్రిజర్వేషన్ ఫౌండేషన్ నిర్వహించిన లెక్కింపులో పార్క్‌లో మొత్తం 1,687 జింకలు ఉన్నట్లు వెల్లడైంది. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా 1,300 నుంచి 1,400 మధ్య నమోదయ్యే జింకల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పర్యాటకులు జింకలకు ప్రత్యేకంగా తయారు చేసిన క్రాకర్లతో పాటు కూరగాయలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా పెడుతున్నారు. దీనివల్ల జింకల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటి సంతానోత్పత్తి కూడా పెరిగిందని నారా డీర్ ప్రిజర్వేషన్ ఫౌండేషన్ వెల్లడించింది. అయితే సందర్శకులు అందించే ఆహారంలో మార్పులు, జింకల సంఖ్య పెరుగుదలతో పార్క్‌లో మనుషులు, జంతువుల మధ్య సంబంధాలు మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
జింకల ప్రవర్తనలో కాలానుగుణంగా కూడా మార్పులు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జింకల సంతానోత్పత్తి కాలం (Rutting Season) కొనసాగుతుంది. ఈ సమయంలో మగ జింకలు సాధారణం కంటే ఎక్కువ దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అలాగే మే నుంచి జూన్ మధ్య ఆడ జింకలు పిల్లలకు జన్మనిస్తాయి. ఈ సమయంలో వాటి పిల్లల దగ్గరకు ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తే రక్షణ చర్యగా దాడి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కాలాల్లో జింకలకు మరింత దూరంగా ఉండాలని పర్యాటకులకు సూచిస్తున్నారు.
నారా డీర్ ప్రిజర్వేషన్ ఫౌండేషన్ కూడా తన అధికారిక వెబ్సైట్లో సందర్శకులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. నారా పార్క్‌లోని చాలా జింకలు మనుషులతో కలిసి ఉండటానికి అలవాటు పడినప్పటికీ, అవి ఇప్పటికీ అడవి జంతువులేనని గుర్తుంచుకోవాలని సూచించింది. అప్పుడప్పుడు అవి మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
జపాన్ పర్యటనలో నారా పార్క్ జింకలకు ఆహారం పెట్టడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోవచ్చు. అయితే వాటిని పెంపుడు జంతువులుగా భావించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదకరం. జింకలకు ఆహారం ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించడం, వాటిని రెచ్చగొట్టకపోవడం, ముఖ్యంగా సంతానోత్పత్తి కాలంలో తగినంత దూరం పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. పర్యాటక ఆనందం కంటే వ్యక్తిగత భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags
Be the first to react