Telangana: ఆటో డ్రైవర్ల సమ్మె విరమణ.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు సఫలం!
Telangana: తెలంగాణలో ఆటో డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మెకు తెరపడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆటో సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించేందుకు సిద్ధమైన ఆటో డ్రైవర్లు.. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఆందోళనను ఉపసంహరించుకున్నారు.
ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం.. నిరవధిక సమ్మె విరమణ..
ఆటో డ్రైవర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం.. సెప్టెంబర్ 1న కీలక భేటీ..
హైదరాబాద్: తెలంగాణలో ఆటో డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మెకు తెరపడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆటో సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించేందుకు సిద్ధమైన ఆటో డ్రైవర్లు.. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఆందోళనను ఉపసంహరించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు
ఆటో డ్రైవర్లు, కార్మికుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ బోర్డు విధివిధానాలను ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 1న కార్మిక శాఖ, రవాణా శాఖ అధికారులు, ఆటో సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ బోర్డు ద్వారా ఆటో కార్మికుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆటో ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం
ఆటో ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2012 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పెరిగిన నిర్వహణ వ్యయాలు, ఇతర పరిస్థితులను పరిశీలించి తగిన నివేదిక ఆధారంగా ఛార్జీలను పెంచుతామని చెప్పారు. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఓలా, ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్
ఆటో డ్రైవర్లకు మరింత ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం సొంత యాప్‌ను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఓలా, ఉబర్ తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనివల్ల ప్రయాణికులు, ఆటో డ్రైవర్ల మధ్య నేరుగా సేవలు అందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.12 వేల సాయం అంశంపై ఇంకా నిర్ణయం లేదు
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామన్న హామీపై కూడా మంత్రి స్పందించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
పాత ఆటోలను ఈ-ఆటోలుగా మార్చేందుకు ఆర్థిక సాయం
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని కోర్ ఏరియాలో ఉన్న పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
అలాగే కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే వారికి కూడా సబ్సిడీలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో ఒకవైపు ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారం తగ్గడంతోపాటు, మరోవైపు నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఈవీ ఆటోలను కొనుగోలు చేయబోతోందన్న ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొనుగోలు చేస్తుందన్న వార్తలు అవాస్తవమని, కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
అధికారుల సమక్షంలో చర్చలు
ఆటో సంఘాలతో జరిగిన చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇళంబర్తి, అదనపు రవాణా కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించాలన్న నిర్ణయం ఆటో డ్రైవర్లలో ఉపశమనం కలిగించింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ముఖ్యంగా సంక్షేమ బోర్డు, ఛార్జీల పెంపు, ఆటోలకు ఆర్థిక సాయం వంటి అంశాలపై సెప్టెంబర్ 1 సమావేశం తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Be the first to react