ఆధార్ కార్డు అప్‌డేట్ ప్రతి పౌరుడికీ తప్పనిసరి అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి స్పష్టం చేసింది. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలు, నివాస ధ్రువీకరణను తప్పక నవీకరించుకోవాలని సూచించింది. చిన్న వయసులో తీసుకున్న ఆధార్‌లో వేలిముద్రలు, కంటి ఐరిస్ వంటి వివరాలు కాలక్రమేణా మారుతుండటంతో అప్‌డేట్ అవసరం అవుతోంది. ముఖ్యంగా ఐదేళ్లు దాటిన పిల్లలు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోకపోతే వారికి జారీ చేసిన బాల ఆధార్ రద్దయ్యే అవకాశం ఉందని UIDAI హెచ్చరించింది.
ప్రస్తుతం ఆధార్ కార్డు విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలకు కీలక పత్రంగా మారింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ తప్పనిసరి అవుతోంది. అంతేకాదు, ప్రభుత్వ అందించే పథకాలైన రేషన్, పెన్షన్, ఆరోగ్య పథకాలు, రైతు సహాయ పథకాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరిగా అవసరం. ఆధార్ అప్‌డేట్ చేయించుకోని వారు ఈ ప్రయోజనాలన్నింటినీ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో అధికారులు ప్రత్యేక ఆధార్ అప్‌డేట్ శిబిరాలను ఏర్పాటు చేశారు. UIDAI మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో తప్పనిసరిగా చేయాల్సిన బయోమెట్రిక్ అప్‌డేట్‌లు సుమారు 1,09,000 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తాత్కాలిక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలతో పాటు సాధారణ ప్రజలకు కూడా అప్‌డేట్ సేవలు అందిస్తున్నారు.
పదిహేడేళ్ల లోపు పిల్లలకు ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం అని అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా వారం రోజుల పాటు ఇలాంటి ప్రత్యేక శిబిరాలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. అందుకే ఈసారి మరింత విస్తృతంగా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ అప్‌డేట్‌ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.