డిజిటల్ లావాదేవీల యుగంలో UPI వ్యవస్థ సాధారణ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. కేవలం మొబైల్ ఫోన్‌తో, కొన్ని సెకన్లలోనే డబ్బు పంపడం, తీసుకోవడం సాధ్యమవుతోంది. నగదు అవసరం లేకుండా రోజువారీ ఖర్చులు పూర్తవుతున్నాయి. అయితే ఈ సౌకర్యమే కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యంతో పెద్ద సమస్యగా మారుతోంది. తొందరపాటు, దృష్టి లోపం లేదా తప్పు వివరాల కారణంగా డబ్బు పొరపాటుగా వేరే వ్యక్తి ఖాతాకు వెళ్లిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది భయపడిపోతుంటారు. కానీ సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ఆ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
UPI ద్వారా పొరపాటున డబ్బు పంపించారనుకుంటే ముందుగా లావాదేవీ పూర్తయ్యిందా లేదా అన్నది నిర్ధారించుకోవడం. కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యల వల్ల ట్రాన్సాక్షన్ పెండింగ్‌లో ఉండొచ్చు. అలా ఉంటే డబ్బు వెంటనే ఖాతా నుంచి వెళ్లదు. కాబట్టి ముందుగా యాప్‌లో ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను చెక్ చేయాలి. లావాదేవీ విజయవంతమైందని కనబడితే, దానికి సంబంధించిన పూర్తి వివరాలను గమనించాలి. ముఖ్యంగా UTR నంబర్‌ను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. ఇది తర్వాత ఫిర్యాదు చేసేటప్పుడు చాలా కీలకంగా మారుతుంది.
తదుపరి దశలో మీరు ఉపయోగించిన UPI యాప్‌లోనే ఫిర్యాదు చేయాలి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్‌లు తప్పు లావాదేవీల కోసం ప్రత్యేకంగా కంప్లైంట్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. సంబంధిత ట్రాన్సాక్షన్‌ను ఎంచుకుని “తప్పు వ్యక్తికి డబ్బు పంపబడింది” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే, మీ ఫిర్యాదు అధికారికంగా నమోదు అవుతుంది. దీనివల్ల సమస్య పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుంది.
యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే మీ బ్యాంక్‌ను కూడా సంప్రదించడం చాలా ముఖ్యం. కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయడం లేదా సమీప బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లావాదేవీ వివరాలను ఇవ్వాలి. బ్యాంక్ అధికారులు మీ UTR నంబర్ ఆధారంగా రిసీవర్ బ్యాంక్‌ను సంప్రదించి డబ్బు తిరిగి ఇవ్వాలంటూ అభ్యర్థన పంపిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రిసీవర్ అనుమతి లేకుండా బ్యాంక్ స్వయంగా డబ్బును తీసుకోలేరు. అందుకే ఈ ప్రక్రియ కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో UPI యాప్‌లో డబ్బు వెళ్లిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. అలా కనిపిస్తే, మర్యాదగా వారిని సంప్రదించి పొరపాటు జరిగిన విషయాన్ని వివరించడం మంచిదే. చాలామంది నిజాయితీగా స్పందించి డబ్బును తిరిగి పంపే అవకాశమూ ఉంటుంది. ఇది సమస్యను త్వరగా పరిష్కరించే సులభమైన మార్గం కావచ్చు. అయితే వారు స్పందించకపోతే లేదా డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే, బ్యాంక్ ఫిర్యాదుల విభాగం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలి.
డబ్బు తిరిగి రాకపోతే, NPCI యొక్క UPI ఫిర్యాదు పోర్టల్‌లో కూడా కేసు నమోదు చేయవచ్చు. ఇది దేశవ్యాప్తంగా UPI లావాదేవీలను పర్యవేక్షించే వ్యవస్థ కావడంతో, సమస్యను మరింత లోతుగా పరిశీలిస్తుంది. చివరి ప్రయత్నంగా RBI బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ దశకు చేరుకునేలోపే చాలా కేసులు పరిష్కారమవుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా రిసీవర్ సహకారం ఉంటే కొన్ని రోజుల్లోనే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ క్లిష్టమైన సందర్భాల్లో రెండు నుంచి నాలుగు వారాల వరకు సమయం పట్టవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, అంత త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. డబ్బు పంపేముందు స్క్రీన్‌పై కనిపించే పేరు తప్పనిసరిగా చెక్ చేయాలి. కొత్త వ్యక్తికి డబ్బు పంపేటప్పుడు ముందుగా చిన్న మొత్తాన్ని ట్రయల్‌గా పంపడం మంచిది. వీలైనంత వరకు UPI ID టైప్ చేయకుండా QR కోడ్ స్కాన్ చేయాలి. ముఖ్యంగా పిన్ ఎంటర్ చేసే ముందు ఒకసారి ఆగి వివరాలు పరిశీలించడం అలవాటు చేసుకోవాలి.