గుంటూరు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాల కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్తగా స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కనెక్టింగ్ రైళ్ల కోసం వేచిచూడాల్సిన ప్రయాణికులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకునేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన విశ్రాంతి కల్పించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేశారు.
ఈ స్లీపింగ్ పాడ్స్‌ను గుంటూరు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్–1, గేట్ నంబర్–3 వద్ద ఏర్పాటు చేశారు.ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, కుటుంబాలు భద్రంగా బస చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్‌లలో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇప్పుడు గుంటూరుకు కూడా విస్తరించారు.
గుంటూరు స్లీపింగ్ పాడ్స్‌లో మొత్తం 64 పడకలు ఉన్నాయి.ఇందులో 52 సింగిల్ బెడ్లు, 12 డబుల్ బెడ్లు ఉన్నాయి. మహిళలు, కుటుంబాల కోసం ప్రత్యేకంగా 10 డబుల్ బెడ్లు, 12 సింగిల్ బెడ్లు కేటాయించారు. అలాగే ఉచిత వైఫై, వేడి నీరు, స్నాక్స్ బార్, ట్రావెల్ డెస్క్, లాకర్ సౌకర్యం, శుభ్రమైన టాయిలెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
బెడ్ల అద్దె ధరలను అందుబాటు రేట్లలో నిర్ణయించారు.సింగిల్ బెడ్‌కు మూడు గంటల వరకూ రూ.150, మూడు గంటల నుంచి 24 గంటల వరకు రూ.300 వసూలు చేస్తున్నారు. డబుల్ బెడ్‌కు మూడు గంటల వరకూ రూ.250, 24 గంటల వరకూ రూ.500గా నిర్ణయించారు. అలాగే గదుల విషయంలో మూడు గంటలకు రూ.300, 24 గంటలకుపైగా ఉంటే రూ.1,000గా ఛార్జీలు ఉన్నాయి.
రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడమే ఈ పథకం ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు.
నాన్ ఫేర్ రెవెన్యూ పెంపులో భాగంగా ఈ సదుపాయం ఏర్పాటు చేసినప్పటికీ, ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని చెప్పారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం ప్రయాణికులకు నిజంగా ఉపశమనం కలిగించే నిర్ణయంగా నిలుస్తోంది.