రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోనుంది. లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా రైతులకు బ్యాంకు రుణాలు అందించే దిశగా కీలక ముందడుగు పడింది. రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. రైతుల ఇబ్బందులను గమనించిన కమిటీ, బ్యాంకర్లతో చర్చలు జరిపి సానుకూల అంగీకారాన్ని సాధించింది. దీంతో ఎన్నాళ్లుగానో రుణాల కోసం ఎదురుచూస్తున్న రాజధాని రైతుల్లో ఆశలు చిగురించాయి.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేకుండానే రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదించింది. దీనిపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించడంతో రైతులకు గుడ్‌న్యూస్ లభించింది.
రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన అంశంపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ జారీ చేసే డాక్యుమెంట్ల ఆధారంగానే రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు అంగీకరించినట్లు కమిటీ వెల్లడించింది. దీని వల్ల వేలాది మంది రైతులకు ఆర్థికంగా భరోసా లభించనుంది. రాజధాని నిర్మాణ పనుల్లో రైతులు భాగస్వాములయ్యేలా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థల సహకారంతో సుమారు 1,600 మందికి ఉపాధి కల్పించగా, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 35 వేల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా స్పష్టత ఇచ్చారు. డీపీఆర్‌లు పూర్తయ్యాయని, జనవరి మొదటి వారంలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని కమిటీ తెలిపింది. జరీబ్ భూముల సమస్యపై ఇప్పటికే సర్వే పూర్తయిందని, కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా రైతులకు న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నాన్ జరీబ్ భూములకు కూడా జరీబ్ భూముల లబ్ధి అందేలా నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు.
లంక భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఇంకా దరఖాస్తు చేసుకోని 277 మంది రైతులు త్వరగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించిన న్యాయపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయ భూములపై వచ్చిన ప్రతిపాదనలపై భూ యజమానులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాజధాని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, స్మశానాల ఏర్పాటుపైనా కమిటీ దృష్టి సారించింది. పది సెంట్లకు తక్కువ ప్లాట్లు ఉన్న రైతుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాలని నిర్ణయించింది. 2013కి ముందు భూములు ఇచ్చిన రైతులను కూడా ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పై చట్టపరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.