తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలన్న అమెరికా నిర్ణయంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ అంశం తమ జాతీయ సార్వభౌమాధికారానికి నేరుగా సవాల్‌గా మారిందని బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌కు ఆయుధాలు అమ్మే దేశాలు, సంస్థలు, వ్యక్తులు తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా హెచ్చరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చైనా అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చైనా అభిప్రాయం ప్రకారం, తైవాన్ అనేది తమ దేశంలో అంతర్భాగమే. ఈ నేపథ్యంలో అమెరికా తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ‘వన్-చైనా సిద్ధాంతానికి’ పూర్తిగా విరుద్ధమని బీజింగ్ స్పష్టం చేసింది. గతంలో చైనా–అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాలను కూడా ఈ చర్యలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతర దేశాల జోక్యం సహించేది లేదని చైనా అధికారులు మరోసారి స్పష్టం చేశారు.
అమెరికా ఆయుధ విక్రయాల నిర్ణయానికి ప్రతిగా, తైవాన్‌కు గత కొన్నేళ్లుగా ఆయుధాల సరఫరాలో పాల్గొన్న 20 అమెరికన్ రక్షణ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ కంపెనీలకు చైనాలో ఉన్న స్థిర, చరాస్తులన్నింటినీ స్తంభింపజేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, చైనా సంస్థలు లేదా వ్యక్తులు ఇకపై ఈ కంపెనీలతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోకూడదని నిషేధం విధించింది. ఇది అమెరికా రక్షణ రంగానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అంతేకాకుండా, తైవాన్‌కు ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషించిన 10 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై కూడా చైనా ఆంక్షలు ప్రకటించింది. వీరు చైనాలోకి ప్రవేశించకుండా నిషేధాలు విధించడమే కాకుండా, అక్కడ ఉన్న వారి ఆస్తులపై కూడా పరిమితులు విధించింది. ఈ చర్యల ద్వారా తాము ఎంత గట్టిగా ఉన్నామో ప్రపంచానికి తెలియజేయాలన్నదే చైనా ఉద్దేశంగా విశ్లేషకులు చెబుతున్నారు.
తైవాన్ అంశాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక “రెడ్ లైన్”గా అభివర్ణించారు. ఈ రెడ్ లైన్ దాటితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అమెరికా తెలుసుకోవాలని హెచ్చరించారు. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించే ఏ సంస్థైనా, వ్యక్తైనా తమ తప్పు నిర్ణయానికి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. చైనా సార్వభౌమాధికారాన్ని తక్కువ అంచనా వేయొద్దని కఠిన స్వరంతో హెచ్చరిక జారీ చేశారు.
ఇదిలా ఉండగా, గత వారం తైవాన్‌కు భారీ ఆయుధాల విక్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, ఈ ఆయుధ విక్రయాల విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు ఉంటుందని వెల్లడించింది. ఇందులో మధ్యశ్రేణి క్షిపణులు, హౌవిట్జర్ గన్స్, అత్యాధునిక డ్రోన్లు, హిమార్స్ రాకెట్ వ్యవస్థలు, యాంటీ-ట్యాంక్ క్షిపణులు వంటి పలు ఆయుధ ప్యాకేజీలు ఉన్నాయి.
ఈ ఆయుధాల ద్వారా తైవాన్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. చైనా వైపు నుంచి వస్తున్న సైనిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తైవాన్ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ ఆసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులను మరింత సున్నితంగా మార్చుతున్నాయి. అమెరికా–చైనా మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.