ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది కొరతను తీర్చేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫీమేల్ నర్సింగ్, స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్‌మన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31, 2025 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వారీగా చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు 19, ఫీమేల్ నర్సింగ్ పోస్టులు 16, స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్‌మన్ పోస్టులు 10, ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టు 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10 ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో సేవలందించే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, ఆరోగ్య రంగంలో అనుభవం సంపాదించుకునే మంచి వేదికగా నిలవనున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ ఒక కీలక అవకాశంగా మారింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఎంఎల్‌టీ, బీఎస్సీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి గరిష్టంగా 42 సంవత్సరాలు మించకూడదు. అర్హతలన్నీ పూర్తిచేసిన అభ్యర్థులు నింపిన దరఖాస్తులను డిసెంబర్ 31, 2025 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత కార్యాలయ చిరునామాలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉండగా, వికలాంగ అభ్యర్థులకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంది. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా, అభ్యర్థులు విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి రూ.32,670 వరకు వేతనం చెల్లించనున్నారు. పూర్తి సమాచారం, దరఖాస్తు విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.