ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్ విషయంలో క్షేత్రస్థాయి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. దివిసీమ, అవనిగడ్డ ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న ఈ లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీపీఆర్ తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
అలాగే, మచిలీపట్నం–నర్సాపురం మధ్య 74 కిలోమీటర్ల కొత్త లైన్, రేపల్లె–బాపట్ల మధ్య 46 కిలోమీటర్ల లైన్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. గూడూరు–విజయవాడ మధ్య నాలుగో రైల్వే లైన్, అందుపల్లి–దుగ్గిరాల మధ్య బైపాస్ లైన్‌కు సంబంధించిన డీపీఆర్‌ల కోసం సర్వే ప్రారంభించడానికి కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి తూర్పు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
విజయవాడ–తెనాలి మధ్య మూడో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు మంత్రి వివరించారు. అలాగే గుడివాడ–దుగ్గిరాల మధ్య కొత్త రైల్వే లైన్ కోసం కూడా సర్వే జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం మధ్య డబ్లింగ్ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. రాష్ట్రానికి రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ఇప్పటికీ కొనసాగుతున్న భారీ పెట్టుబడులను మంత్రి గుర్తుచేశారు.
2014కు ముందు ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ కేవలం ₹886 కోట్లు మాత్రమే ఉండేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి ₹9,417 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించామని చెప్పారు. 2014–2025 మధ్యకాలంలో మొత్తం 1,582 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు ప్రారంభమయ్యాయి. ఇది గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ అభివృద్ధిగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీలో 12 కొత్త రైల్వే లైన్లు, 27 డబ్లింగ్ ప్రాజెక్టులు కలిపి 4,498 కిలోమీటర్ల పొడవుతో సాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం ₹70,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గత నాలుగేళ్లలో 15 కొత్త రైల్వే లైన్లు, 49 డబ్లింగ్ ప్రాజెక్టుల కోసం మొత్తం 64 సర్వేలు చేపట్టారని చెప్పారు. సర్వేలు పూర్తయిన తర్వాత మరిన్ని రైల్వే మౌలిక సదుపాయాల పనులు చేపట్టడానికి మార్గం సుగమం కానుంది.