జర్మనీ ప్రస్తుతం తీవ్రమైన నైపుణ్య ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది. వృద్ధిపోతున్న జనాభా, వేగంగా మారుతున్న పరిశ్రమల అవసరాలు కలసి విస్తృత రిక్రూట్‌మెంట్ సంక్షోభాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఐటీ, ఆరోగ్య రంగం, పునరుత్పాదక ఇంధనం వంటి అత్యవసర విభాగాల్లో భారీగా ఖాళీలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జర్మన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారతీయ టాలెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో, యూరప్‌లో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో భారత విద్యార్థులు, యువ నిపుణులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది.
నైపుణ్యం కలిగిన వ్యక్తులను వేగంగా జర్మనీలోకి రప్పించేందుకు ప్రభుత్వం వలస విధానాలను సమూలంగా మార్చింది. వీసా అప్లికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, డాక్యుమెంటేషన్‌ను సరళీకరించడం, ఈయూ బ్లూ కార్డ్‌కు అవసరమైన కనీస జీత పరిమితిని తగ్గించడం కీలక నిర్ణయాలుగా నిలిచాయి. అంతేకాదు, కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆపర్చునిటీ కార్డ్’ (Opportunity Card) వ్యవస్థ ద్వారా విదేశీయులు ఉద్యోగం పొందకముందే జర్మనీలో ప్రవేశించి పని శోధన చేయడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య నిపుణుల కోసం జర్మనీని అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయి.
ఇలాంటి సంస్కరణల్లో కేంద్రంగా నిలుస్తున్నవి జర్మనీకి చెందిన ప్రఖ్యాత టీయూ9 (TU9) – టెక్నికల్ యూనివర్శిటీల సమూహం. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్‌కు అత్యంత కీలకమైన స్టెమ్ కోర్సులను అందిస్తున్నాయి. నూతన సాంకేతిక రంగాల్లో నైపుణ్యం పెంపుదలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. భారత విద్యార్థుల సంఖ్య ఇప్పటికే పెరుగుతుండగా, సంస్కరణల వల్ల ఈ ధోరణి మరింత వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, బోర్డర్‌ప్లస్ సీఈఓ మయాంక్ కుమార్ మాట్లాడుతూ—“జర్మనీ పారిశ్రామిక లక్ష్యాలు, జనాభా సంక్షోభం కలిసి భారత యువతకు అరుదైన అవకాశాన్ని సృష్టించాయి” అన్నారు. టెర్న్ గ్రూప్ ఫౌండర్ అవినావ్ నిగమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ—“ప్రస్తుతం జర్మనీలో సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వచ్చే సంవత్సరాల్లో లక్షలాది మంది రిటైర్ కావడంతో దీర్ఘకాలిక టాలెంట్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులకు అపూర్వమైన డిమాండ్ ఉంది” అని వివరించారు. ఈ నేపథ్యంలో 2025లో ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తున్న భారత విద్యార్థులకు జర్మనీలోని స్టెమ్ ప్రోగ్రామ్‌లు అత్యంత ‘కెరీర్–బూస్టింగ్’ అవకాశాలను అందజేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.