సినీ పరిశ్రమలో పని గంటలపై మళ్లీ చర్చ రగులుతోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ఇటీవల రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అనూహ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్‌కు దారి తీశాయి. ప్రసవం తర్వాత ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తాను అతిగా పని చేయడం కుదరదని ఆమె స్పష్టం చేయడం చాలామంది నటులు, నటీమణుల నుంచి మద్దతు తెచ్చుకున్నా… మరోవైపు విభిన్న అభిప్రాయాలు కూడ వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించడంతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. సినిమా రంగం ఇతర ఉద్యోగాల్లా కాదని, దీన్ని ఒక లైఫ్ స్టైల్‌లా భావించాల్సిందేనని రానా అభిప్రాయపడ్డారు. యాక్టింగ్ అనేది గంటలకతీతంగా జరిగే ప్రక్రియ అని ఎనిమిది గంటలు కూర్చొని పని చేసేసే పని ఇది కాదు అని రానా స్పష్టం చేశారు. ఒక పాత్రను మలచడం, ఒక ముఖ్యమైన సీన్‌ను తెరపైకి తేవడం అన్నవి కేవలం నటుడి చేతుల్లోనే ఉండవని, కెమెరా, లైటింగ్, దిశ, రచన, మేకప్ వరకు మొత్తం టీమ్‌లోని ప్రతీ ఒక్కరి కట్టుబాటు అవసరమని గుర్తుచేశారు.
సినిమాల ప్రపంచంలో ఒక ఫిక్స్‌డ్ షిఫ్ట్ వ్యవహారం ప్రాక్టికల్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ విషయం పై తన అనుభవాలు వెల్లడించారు. మలయాళ ఇండస్ట్రీలో షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం కష్టం అని తమిళ సినీ రంగంలో మాత్రం నటీనటులకు ప్రతి నెలా రెండు ఆదివారాలు సెలవులు ఇస్తారని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాల సమయంలో సాయంత్రం 6 గంటలకే తాను ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని దుల్కర్ గుర్తుచేశారు. రోజంతా ఎక్కువగా శ్రమించి ఒకేసారి అలసిపోవడం కంటే, ప్రతిరోజూ పనిని కొంచెం చొప్పున కొనసాగించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
సినిమా రంగం అనేది సృజనాత్మకత, అంకితభావం, ప్రేరణలు కలగలసిన ప్రపంచం. అందులో పని గంటలను పరిమితం చేస్తూ కఠిన నియమాలు పెట్టాలా? లేక కళాత్మక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని స్వేచ్ఛ ఇవ్వాలా? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత తరుణంలో కళాకారుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అంచనాలు కలిసి పరిశ్రమ కొత్త మార్గాలను ఆలోచించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. రానా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపిరి పోస్తూ సినీవర్గాల్లో కొత్త స్పందనలను రేకెత్తిస్తున్నాయి.