ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తిరిగి మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఏడు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ విచారణలో సీబీఐ ఇప్పటివరకు స్పష్టమైన ముగింపు ఇవ్వలేదన్న విమర్శల మధ్య, సుప్రీంకోర్టు సూచనలు కేసు దృష్టిని మళ్లీ ప్రత్యేక కోర్టు వైపు తిప్పాయి. సునీతారెడ్డి గతంలో దాఖలు చేసిన వినతిని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఇంకా అదనపు దర్యాప్తు అవసరమో లేదో ట్రయల్ కోర్టే నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఆదేశాల మేరకు సునీత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా, కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
సీబీఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తు అసంపూర్ణంగా ఉందని, ఇంకా బయటకు రాని కీలక అంశాలు ఉన్నాయని సునీత కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఇంకా వెలుగులోకి రాలేదని, దీనికి సమగ్రంగా విచారణ జరపాలని ఆమె న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే దాఖలైన ఛార్జ్‌షీట్‌కు అదనంగా అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఇవ్వాలని సీబీఐను మరోసారి ఆదేశించమని కోర్టును కోరారు. అలా చేస్తే ఈ కేసులోని పలు మిస్సింగ్ లింకులు బయటపడతాయని, నిజానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుందని ఆమె వాదనలు సూచించాయి.
ఈ వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు మాత్రం వెంటనే తీర్పు ఇవ్వకుండా రిజర్వ్ చేసింది. మరికొన్ని కీలక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. దీనిపై స్పష్టమైన తీర్పు ఈ నెల 10న వెలువడనుంది. ఈ నేపథ్యంలో కేసు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రాజకీయంగా కూడ ఈ కేసు ఎంతో ప్రభావం చూపిన నేపథ్యంతో సీబీఐకు మళ్లీ దర్యాప్తు అధికారాలు ఇవ్వనున్నారా? లేక ఇప్పటికే ఉన్న విచారణను సరిపెట్టుకుంటారా? అన్న ప్రశ్నపై అందరి దృష్టి ఉంది.
వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంవత్సరాలుగా వేడి చర్చలకే కేంద్రబిందువుగా నిలుస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు, విచారణలో వచ్చిన మలుపులు, మారిన వర్షన్‌లు ఈ కేసును ఇంకా క్లిష్టంగా మార్చాయి. ఇప్పుడు ప్రత్యేక కోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా భావిస్తున్నారు. తీర్పుతో దర్యాప్తు మరో దిశలోకి వెళ్లే అవకాశం ఉందో లేదో డిసెంబర్ 10న స్పష్టమైన సమాధానం రానుంది.