జర్మనీ మరోసారి భారతీయులకు పెద్ద అవకాశాల ద్వారాలు తెరిచిందని చెప్పుకోవాలి. భవిష్యత్‌లో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య కార్మికుల కొరత తీవ్రంగా పెరుగుతుండటంతో, ఆ దేశం వలస విధానాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి..ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో ఖాళీలు రోజురోజుకు పెరుగుతుండటంతో, భారత యువతను పెద్ద ఎత్తున ఆహ్వానించేందుకు జర్మనీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అదే భాగంగా వీసా నిబంధనలు సులభతరం చేసి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి మార్గాలు మరింత అందుబాటులో ఉంచింది.
ఇప్పటికే ఉన్న ఈయూ బ్లూ కార్డ్ అర్హతలను తగ్గించడం ద్వారా మరింత మందికి అవకాశాలు కల్పించిన జర్మనీ, కొత్తగా ‘ఆపర్చునిటీ కార్డ్’ను ప్రవేశపెట్టింది. ఈ కార్డ్ ద్వారా అర్హత కలిగిన విద్యార్థులు, నిపుణులు జర్మనీలో ఉద్యోగాలు లేదా హయ్యర్ స్టడీస్ కోసం సులభంగా ప్రవేశించగలరు. ముఖ్యంగా టీయూ9 యూనివర్సిటీలు ఇందులో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ విశ్వవిద్యాలయాలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక కోర్సులను అందిస్తూ, నైపుణ్యాలను పెంపొందించే కేంద్రాలుగా నిలవనున్నాయి.
ఈ తాజా మార్పులపై నిపుణులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. బోర్డర్‌ప్లస్ సీఈఓ మయాంక్ కుమార్ అభిప్రాయపడుతూ, జర్మనీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభం మరియు పారిశ్రామిక విస్తరణ భారత విద్యార్థులకు అరుదైన అవకాశం అందించిందన్నారు. 2025లో స్టెమ్ కోర్సులు చదవదలచిన విద్యార్థులకు జర్మనీ అత్యుత్తమ గమ్యస్థానమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాల పరంగా కూడా పరిస్థితి మరింత అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
టెర్న్ గ్రూప్ వ్యవస్థాపకుడు అవినావ్ నిగమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం జర్మనీలో ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో లక్షలాది మంది రిటైర్ అవుతారని, అందువల్ల ఇంజినీరింగ్, ఐటీ, ఆరోగ్య రంగాల్లో డిమాండ్ భారీగా పెరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ ఇంజినీరింగ్ కోర్సులకు భారీ అవకాశాలు లభిస్తాయని నిగమ్ పేర్కొన్నారు.
ఈ పరిణామాలన్నీ భారతీయ విద్యార్థులు మరియు నైపుణ్య నిపుణులకు జర్మనీ ఒక ప్రధాన అవకాశ భూమిగా మారిందని స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్ పరిశ్రమలను లక్ష్యంగా పెట్టుకుని ఉన్న వారు నైపుణ్యాలను పెంచుకునే ఉత్తమ వేదికగా జర్మనీ ఎదుగుతోంది. వీసా సడలింపులు, కోర్సు అవకాశాలు, భారీ ఉద్యోగ ఖాళీలు కలిసి భారత యువతకు ఈ కాలం ‘గోల్డెన్ పీరియడ్’గా మారే అవకాశం కనిపిస్తోంది.