Pawan Kalyan: త్వరగా, పూర్తి ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలి.. పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ పోస్ట్!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... పవన్ కల్యాణ్ త్వరగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
- మూడు గంటల పాటు కొనసాగిన ఆపరేషన్..
- రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తో బాధపడుతున్న పవన్..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గత పదేళ్లుగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాలకు 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్' (కండరాలు, కీళ్ల గాయాలు) తీవ్రస్థాయిలో ఉన్నట్లు తేలింది. దీనికి శస్త్రచికిత్స ఒక్కటే సరైన మార్గమని వైద్య నిపుణులు స్పష్టం చేయడంతో ఆయన సర్జరీకి సిద్ధమయ్యారు. శనివారం ఉదయం నిపుణులైన వైద్యుల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స నిర్వహిస్తే సర్జరీ అనంతరం నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని, రోజువారీ కదలికలు స్తంభించిపోతాయని వైద్యులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశామని, ఎడమ భుజానికి మరో రెండు నెలల విరామం తర్వాత శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు.
పవన్ కల్యాణ్కు సర్జరీ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ఆత్మీయంగా స్పందించారు. "గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు పూర్తి స్థాయిలో, అత్యంత వేగంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని ముఖ్యమంత్రి తన పోస్ట్లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ప్రజా సేవ కోసం ఇన్నాళ్లూ తీవ్రమైన నొప్పిని భరిస్తూనే ఎన్నికల ప్రచారాలు, వారాహి యాత్రలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఇటీవల అత్యవసర అధికారిక పనులన్నీ ముగించుకున్నాకే ముంబై వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ప్రత్యేక గదిలో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో నిలకడగా కోలుకుంటున్నారు. డెప్యూటీ సీఎం శస్త్రచికిత్స విజయవంతం కావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో అటు జనసైనికులు, ఇటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటున్నారు.
Be the first to react