⚡ BREAKING

Nara Lokesh: ఏపీని విద్యా రంగంలో మోడల్ స్టేట్‌గా మారుస్తాం.. దొరసానిపల్లి స్కూల్ విజిట్‌లో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

Nara Lokesh: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఏపీని విద్యా రంగంలో మోడల్ స్టేట్‌గా మారుస్తాం..
ఏపీని విద్యా రంగంలో మోడల్ స్టేట్‌గా మారుస్తాం..
  • పాఠశాల పనితీరు, హాజరుపై అధికారులకు కీలక ఆదేశాలు..

  • దొరసానిపల్లి జడ్పీ స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలను వేగవంతం చేశారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఆయన ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలోని జిల్లా పరిషత్ (ZPHS) ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ తనిఖీల్లో భాగంగా స్కూల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలు (Learning Outcomes), ఉపాధ్యాయుల బోధనా తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం నేరుగా పదో తరగతి గదిలోకి వెళ్లిన మంత్రి, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర' విద్యా కిట్ల నాణ్యత ఎలా ఉందనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేవలం పుస్తకాల చదువులకే పరిమితం కాకుండా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై కూడా విద్యార్థులు కరెంట్ అఫైర్స్ అవగాహన పెంచుకోవాలని సూచిస్తూ, "ఇరాన్-అమెరికా యుద్ధాన్ని మీలో ఎంతమంది గమనిస్తున్నారు?" అని ప్రశ్నించి వారి జనరల్ నాలెడ్జ్ను పరీక్షించారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి శారీరక వ్యాయామం, ఆటలు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా వారికి వివరించారు.

విద్యార్థులతో సరదాగా సాగిన ఈ సంభాషణలో మంత్రి నారా లోకేశ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నా విద్యాశాఖ మంత్రి భవిష్యత్ అంతా మీ ఫలితాలపైనే ఆధారపడి ఉంది, ఒకవేళ మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు రాకపోతే నా మంత్రి పదవికి మార్కులు పోయినట్లే" అంటూ విద్యార్థుల్లో బాధ్యతను, ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి దీటుగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే 'తల్లికి వందనం' వంటి వినూత్న పథకాలతో పాటు నాణ్యమైన పుస్తకాలు, యూనిఫాం వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ మరియు నాణ్యత గురించి విద్యార్థులను ఆరా తీయగా, భోజనం చాలా బాగుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

క్లాస్ రూమ్ తనిఖీ అనంతరం మంత్రి లోకేశ్ స్కూల్ అకడమిక్ రికార్డులపై ఉపాధ్యాయులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ ఆధారంగా ఈ స్కూల్కు కేవలం 1.3 స్టార్ రేటింగ్ మాత్రమే రావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనికి గల కారణాలను స్కూల్ ప్రిన్సిపాల్ ఏ. ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. క్లాసుల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, డ్రాపౌట్స్ తగ్గించడానికి మరియు విద్యార్థుల హాజరును పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యా ప్రమాణాల్లో వెనుకబడిన పాఠశాలలపై మండల విద్యాధికారులు (MEOs) ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా స్కూళ్ల ప్రగతిపై సమీక్షలు జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే విద్యా రంగంలో ఒక మోడల్ స్టేట్గా నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని, దీనిని సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలపై సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపాల్, వచ్చే విద్యాసంవత్సరం నాటికి కష్టపడి తమ పాఠశాలకు 4 స్టార్ రేటింగ్ సాధించి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆకస్మిక తనిఖీ ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేశ్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఉత్సాహంగా గ్రూప్ ఫొటోలు దిగారు.

Tags

Be the first to react

Latest