⚡ BREAKING

Praja Vedika: రూ. 50 వేల బాకీ కోసం రూ. 50 లక్షల ఆస్తిపై కన్నేసిన ఆర్‌టీఓ.. గ్రీవెన్స్ లో ఫిర్యాదు! భూ రికార్డుల ఫోర్జరీ..

Praja Vedika: గుంటూరుకు చెందిన షేక్ అక్రమ్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. లాలాపేటలో ఉన్న 'బదిగినేని సర్వీస్ స్టేషన్' (HPCL పెట్రోల్ బంక్)ను బదిగినేని పద్మజ అనే మహిళ వద్ద నుంచి 5 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాను.

రూ. 50 వేల బాకీ కోసం రూ. 50 లక్షల ఆస్తిపై కన్నేసిన ఆర్‌టీఓ..
రూ. 50 వేల బాకీ కోసం రూ. 50 లక్షల ఆస్తిపై కన్నేసిన ఆర్‌టీఓ..
  • భూ రికార్డుల ఫోర్జరీ.. తండ్రి స్థానంలో మొగుడి పేరు మార్చి 3 ఎకరాల 59 సెంట్ల భూమి స్వాహా..

  • Politics: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..

Praja Vedika: గుంటూరుకు చెందిన షేక్ అక్రమ్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. లాలాపేటలో ఉన్న 'బదిగినేని సర్వీస్ స్టేషన్' (HPCL పెట్రోల్ బంక్)ను బదిగినేని పద్మజ అనే మహిళ వద్ద నుంచి 5 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాను. ఆ సమయంలో బంకులో భాగస్వామ్యం ఇప్పిస్తానని నమ్మించిన పద్మజ తన వద్ద నుంచి రూ.74 లక్షలు తీసుకుంది. 

అయితే హెచ్పీసీఎల్ (HPCL)సంస్థ భాగస్వామ్యానికి నిరాకరించడంతో, పెద్దల సమక్షంలో 50 శాతం షేర్ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి తోడు వ్యాపార పెట్టుబడి కింద తాను మరో రూ.50 లక్షలు సదరు మహిళకు ఇచ్చాను. గత 4 ఏళ్లుగా వ్యాపారం సాగుతున్న క్రమంలో, పద్మజ కుమారుడు బదిగినేని రామయ్య, కోడలు అనుష పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి షేర్ ఇవ్వడం కుదరదని, అగ్రిమెంట్ను రద్దు చేసుకోవాలని తనని బెదిరించారు. 

దీనిపై గతంలో ఏఎస్పీ గారికి ఫిర్యాదు చేయడంతో, పంచాయితీ చేసి పద్మజ పేరిట ఉన్న రూ.45 లక్షల విలువైన ఫ్లాట్ను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, రూ.14 లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించారు. కానీ, మిగిలిన రూ.15 లక్షల బాకీతో పాటు, వ్యాపారంలో తనకి రావలసిన షేర్ డబ్బులు రూ.23.20 లక్షలను పద్మజ సొంతానికి వాడుకుంది. అలాగే, 19-12-2023న పెట్రోల్ స్టాక్ నిమిత్తం తాను రూ.22 లక్షలు ఆన్లైన్ పేమెంట్ చేయగా, అదే రోజు పద్మజ ప్రవర్తన సరిగా లేకపోవడంతో హెచ్పీసీఎల్ సంస్థ ఆ బంకు నిర్వహణను తాత్కాలికంగా జైళ్ల శాఖకు అప్పగించింది. ఆ సమయంలో బంకులో ఉన్న రూ.10.17 లక్షల విలువైన గ్రౌండ్ స్టాక్ డబ్బులను జైళ్ల శాఖ పద్మజ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. 

ఈ సొమ్మును కూడా తనకి ఇవ్వకుండా తల్లీకొడుకులు వాడుకున్నారు. తనకు రావలసిన సుమారు రూ. 47 లక్షల పైచిలుకు మిగిలిన బకాయిల గురించి నిందితుడు బదిగినేని రామయ్యను నిలదీయగా.. దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్ర పరిణామాల ఉంటాయని బెదిరించారు. అంతేకాకుండా, డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో తనపైనే తప్పుడు ప్రైవేట్ క్రిమినల్ కేసులు పెట్టి మానసికంగా, ఆర్థికంగా వేధిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం శీతాయలంక గ్రామానికి చెందిన ఆరిగ వరప్రసాద్ బాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..కరోనా సమయంలో  తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాను. తన అవసరాల నిమిత్తం ఏలూరులో ఆర్.టి.ఓగా పనిచేస్తున్న తల్లాప్రగడ భీమారావు అనే వ్యక్తిని అప్పు అడిగాను. అయితే, భీమారావు ఒక షరతు పెట్టాడు. "మీ అమ్మ కట్టించిన రూ. 50 లక్షల విలువైన ఇంటిని తాత్కాలికంగా నా కుమార్తె మద్దాలి సోనీ సంపూర్ణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే రూ. 7 లక్షల అప్పు ఇస్తానని, తిరిగి ఆ డబ్బులు చెల్లించగానే ఇల్లు మళ్లీ మీ పేరు మీద రాసిస్తానని నమ్మబలికాడు. గుడివాడకు చెందిన టి. శ్రీను అనే మధ్యవర్తి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. నమ్మకంతో తన ఇంటిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి రూ. 7 లక్షలు తీసుకున్నాను.

ఆ తర్వాత ఒప్పందం ప్రకారం మధ్యవర్తి శ్రీను ద్వారా రూ. 7 లక్షల 50 వేలు వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాను. ఇంకా కేవలం రూ. 50 వేల బాకీ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం తన ఆరోగ్యం క్షీణించడంతో ఆ మిగిలిన రూ. 50 వేలు చెల్లించడానికి రెండు నెలల సమయం కావాలని కోరాను. కానీ భీమారావు, అతని మనుషులు ఆ గడువు ఇవ్వకుండా రూ. 50 లక్షల విలువైన ఆ ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చూస్తూ తనని వేధిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన కడియాల ప్రశాంతి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివసించే రిటైర్డ్ ఉపాధ్యాయుడు కడియాల ప్రసాద్, ఊరిలోని గ్రామ కంఠం భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించాడు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వ రోడ్డును సైతం ఆక్రమించి పెద్ద ప్రహారీ గోడ నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ అక్రమ నిర్మాణం వల్ల రోడ్డుపై వాహనాలు తిరగడానికి వీలు లేకుండా పోవడమే కాకుండా, ఎదురుగా ఉన్న తన ఇంటి రవాణా మార్గం పూర్తిగా బంద్ అయింది. స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారు పైపాలెం ప్రాథమిక పాఠశాల నుండి ఇందిరమ్మ కాలనీ వరకు మంజూరు చేసిన 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు పనులను కూడా సదరు ఉపాధ్యాయుడు అడ్డుకున్నాడు.

కాంట్రాక్టర్ను బెదిరించి సుమారు 100 అడుగుల మేర రోడ్డు పనులు జరగకుండా పది రోజుల పాటు నిలిపివేశాడు. ఈ వివాదంపై గ్రామ పెద్దలు అర్ధరాత్రి వరకు పంచాయితీ నిర్వహించి, రెండు అడుగులు వెనక్కి జరిపి గోడ కట్టుకోవాలని చెప్పగా మొదట ఒప్పుకున్న ప్రసాద్, ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ రోడ్డుపైనే గోడ నిర్మించాడు. గ్రామ పంచాయితీ కార్యదర్శి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి సదరు స్థలానికి సంబంధించిన పత్రాలు చూపించమనగా, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. డాక్యుమెంట్లు పరిశీలించే వరకు నిర్మాణాలు ఆపాలని కార్యదర్శి ఆదేశించినా వినకపోవడంతో, పంచాయితీ తరఫున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. 

పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నప్పటికీ, రాజకీయ బలాన్ని వాడుకుంటూ సదరు రిటైర్డ్ టీచర్ 19-04-2026 న మళ్లీ కూలీలను తెచ్చి కాంక్రీట్ పనులు ప్రారంభించాడు. పంచాయితీ అధికారులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా, అతని వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం వల్ల అక్రమ ప్రహారీ గోడను తొలగించలేకపోయారు. గతంలో జిల్లా కలెక్టర్కు విన్నవించినా ఫలితం లేకపోయింది. కావున వారిపై చర్యలు తీసుకోని అక్రమ ప్రహారీ గోడను పూర్తిగా తొలగించి నిలిచిపోయిన ప్రభుత్వ రోడ్డు పనులు సజావుగా సాగేలా చూడాలని కోరారు.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం పులింగంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఫరియాద్ జాన్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నెంబర్ 723లో బావాఖాన్ అనే వ్యక్తికి చెందిన పూర్వీకుల ఆస్తి ఉంది. ఈ ఆస్తికి సంబంధించిన ఆర్వోఆర్ నకలు, ఈసీ వంటి పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. బావాఖాన్ కొడుకులైన ముస్తాఫా ఖాన్, మావా ఖాన్ వారసుల మధ్య ఈ భూమి పంచబడుతూ వచ్చింది. అయితే బావాఖాన్ కుమార్తె అయిన ఖైరున్బీ ఈ ఆస్తి పత్రాలలో తండ్రి స్థానంలో మొగుడు పేరు వచ్చేలా తప్పుడు రికార్డులు రాయించి 3 ఎకరాల 59 సెంట్ల భూమిని తీసుకున్నారు.

అలాగే ముస్తాఫా ఖాన్ కుమార్తె ఫలికదా ఖాన్ పేరిట కూడా పాస్ బుక్ జారీ అయింది. ఈ క్రమంలో మిగిలిన భాగస్వాములైన చిన్నాన్న, పెద్దనాన్న పిల్లల హక్కుల కోసం గతంలో ఆర్డీఓ కోర్టును కూడా ఆశ్రయించాం. న్యాయబద్ధంగా తమ కుటుంబానికి 3 ఎకరాల 19 సెంట్ల భూమి దక్కాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రికార్డుల్లో తప్పుడు పేర్లు మార్చడం వల్ల వారికి కేవలం 1 ఎకరా 79 సెంట్లు మాత్రమే చూపిస్తోంది. ఈసీలో కూడా అంతే నమోదై ఉంది. దీనివల్ల తమకు రావాల్సిన మిగతా 3 ఎకరాల 19 సెంట్ల పిత్రార్జిత భూమిని కోల్పోయాం. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

కాకినాడకు చెందిన దుర్గపావని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన భర్త గతంలోనే మరణించారు. అప్పటి నుంచి తన తల్లిగారి గృహంలో నివాసముంటున్నాను. అయితే, గత కొంతకాలంగా చుట్టుపక్కల నివసించే సి.హెచ్. దుర్గ, సి.హెచ్. చిన్న, సి.హెచ్. లోవ, సి.హెచ్. సతీష్, సి.హెచ్. ఉదయ్, సి.హెచ్. పార్వతి, వాకాడి గీత, వాకాడి మౌనిక, ఖ్వాజా భాషా (ముత్తా నగర్) అనే వ్యక్తులు అంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. తనని ఆ ప్రాంతంలో ఉండనివ్వకుండా "ఇక్కడ ఎలా బ్రతుకుతావో చూస్తాం" అంటూ నిరంతరం మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తనకు సంబంధించిన రూ. 15,000 విలువైన సెల్ ఫోన్, రూ. 3 లక్షల నగదును దొంగిలించుకొని వెళ్ళిపోయారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామానికి చెందిన ఎన్. నాగరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నెంబర్ 716 లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 06-05-1999 నాడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పట్టాలు పంపిణీ చేశారు. అయితే పట్టాలు ఇచ్చిన అధికారులు, ఆ స్థలాలను కొలతలు వేసి ఏ లబ్ధిదారుడికి ఎక్కడ స్థలం ఉందో సరిహద్దులు చూపించలేదు. దీనివల్ల గత 27 ఏళ్లుగా లబ్ధిదారులు అక్కడ ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ఆ భూమిని కొంతమేర అక్రమంగా ఆక్రమించుకున్నారు. 

ఇటీవల మండల సర్వేయర్ ద్వారా భూమిని సర్వే చేయించగా, గతంలో కేటాయించిన భూమి కంటే ప్రస్తుతం భూమి విస్తీర్ణం తగ్గినట్లు తేలింది. ఈ తగ్గిన కొలతల ప్రకారమైనా సరే, మిగిలిన భూమిని సరిహద్దులు గీసి లబ్ధిదారులైన 31 మందికి పంచి ఇవ్వాలని ఎన్నో మార్లు అధికారుల చుట్టూ తిరిగాం. దీనిపై ఎర్రగుంట్ల తహసీల్దార్ కి ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఆయన స్పందించడం లేదు. ప్రభుత్వ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఫిర్యాదు చేసినా కూడా, కింది స్థాయి అధికారులు మొక్కుబడిగా సమాధానాలు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని సరిహద్దుల కొలతలు వేయించి ఆక్రమణలను తొలగించి లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల స్థలాలను అప్పగించి న్యాయం చేయాలని కోరాడు.
 
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ప్రహ్లాదపురం గ్రామానికి చెందిన దాసరి అప్పలనరసింహ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..2019లోనే ఇంటి స్థలం మంజూరు కోసం అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. అర్హుల జాబితాలో తన పేరును కూడా చేర్చారు. అయితే, ఆ ప్రక్రియ జరిగి ఏడేళ్లు గడుస్తున్నా, అధికారులు నేటికీ తుది వెరిఫికేషన్ పూర్తి చేసి తనకు ఇంటి స్థలాన్ని కేటాయించలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. కావున తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Tags

Be the first to react

Latest