Chintakayala Vijay: రాజ్యసభలో సంచలనం.. చట్ట పరిపాలన ఏమైంది? జగన్ 31 కేసుల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు!
Chintakayala Vijay: వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న 31 క్రిమినల్ కేసులలో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
- Politics: సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుపై రాజ్యసభలో చర్చ..
- జగన్ కేసులలో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు గడిచాయన్న విజయ్..
Chintakayala Vijay: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న 31 క్రిమినల్ కేసులలో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రక్రియ పూర్తికాకపోవడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లుపై పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జగన్ కేసుల ఆలస్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు సభలో వేడి రాజేశాయి. విజయ్ మాట్లాడే సమయంలో వైసీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నిరసనకు దిగారు.
డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లా? విజయ్ సంధించిన కీలక ప్రశ్నలు..
కేసు విచారణలో జరుగుతున్న ఆలస్యానికి గల ప్రధాన కారణాలను రాజ్యసభ వేదికగా చింతకాయల విజయ్ ఎత్తిచూపారు. వరుస పిటిషన్ల వ్యూహం: జగన్‌తో పాటు ఈ సీబీఐ కేసుల్లోని పలువురు నిందితులు కోర్టుల్లో వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని గుర్తుచేశారు. న్యాయమూర్తుల బదిలీలు: ఈ పిటిషన్లపై వేర్వేరు న్యాయమూర్తులు విచారణ జరుపుతున్నప్పటికీ... కేసు తుది తీర్పు దశకు వచ్చే సమయానికి జడ్జీలు బదిలీ అవుతున్నారని తెలిపారు. ట్రయల్ ఎప్పుడు మొదలవుతుంది?: కేవలం డిశ్చార్జ్ పిటిషన్ల విచారణకే 13 సంవత్సరాలు పడితే, ఇక అసలు కేసు ట్రయల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? తుది తీర్పు ఇంకెప్పుడు వెలువడుతుందని ఆయన నిలదీశారు.
చట్టపరిపాలనపై ప్రజా విశ్వాసానికి సంబంధించిన అంశం..
జడ్జీల కొరత, వరుస బదిలీల కారణంగా దశాబ్దానికి పైగా విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో ఎంపీ చింతకాయల విజయ్ ఆందోళన:"ఇది కేవలం ఒక్క జగన్‌కు సంబంధించిన వ్యక్తిగత అంశం మాత్రమే కాదు. దేశంలో చట్టపరిపాలన, న్యాయ వ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉండే నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించిన ముఖ్యమైన విషయం. సీబీఐ ప్రత్యేక కోర్టుల పనితీరును వేగవంతం చేయడం, న్యాయమూర్తుల నియామకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి." సీబీఐ ప్రత్యేక కోర్టులలో విచారణలు త్వరగా ముగిసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags
Be the first to react