Women And ChildSafety: బాలల రక్షణకు ఏపీ పోలీసుల కీలక అడుగు... ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ ప్రారంభం!

Women And ChildSafety: ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేకంగా 'సెక్సువల్ అఫెండర్స్ షీట్స్' (SOS) తెరిచి వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచనున్నారు.

ఆపరేషన్ చిన్నారి తల్లి’ ప్రారంభం
ఆపరేషన్ చిన్నారి తల్లి’ ప్రారంభం

‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’తో కఠిన శిక్షలు...

ఏపీ వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ సంచలన డ్రైవ్...

హాట్‌స్పాట్లలో రాత్రివేళల పెట్రోలింగ్ తీవ్రతరం...

Women And ChildSafety: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులు, మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్ శాఖ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, బాలలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా "ఆపరేషన్ చిన్నారి తల్లి" పేరుతో రాష్ట్రవ్యాప్త ప్రత్యేక డ్రైవ్‌ను విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో డిజిపి హరీష్ కుమార్ గుప్తా గురువారం అధికారికంగా ప్రారంభించారు. "సుస్థిర అభివృద్ధికి భద్రమైన చిన్నతనమే పునాది" అనే నినాదంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో ఆవిష్కరించారు.

నేరస్థులపై కఠిన నిఘా – ‘SOS’ షీట్లు: ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేకంగా 'సెక్సువల్ అఫెండర్స్ షీట్స్' (SOS) తెరిచి వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచనున్నారు. పదే పదే నేరాలకు పాల్పడేవారు, మత్తు పదార్థాలకు బానిసైనవారు మరియు అనుమానాస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని డిజిపి ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాలను (హాట్‌స్పాట్స్) గుర్తించి, అక్కడ రాత్రివేళల్లో నైట్ పెట్రోలింగ్ మరింత తీవ్రతరం చేయనున్నారు.

60 రోజుల్లోనే చార్జిషీట్ – వేగవంతమైన విచారణ: పోక్సో (POCSO) కేసుల్లో అరెస్టుల పెండింగ్‌ను పూర్తిగా జీరో స్థాయికి తీసుకురావడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నేరం జరిగిన 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్' వ్యవస్థ ద్వారా కోర్టుల్లో విచారణను వేగవంతం చేసి, నేరస్తులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూడనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాఠశాలల్లో అవగాహన – కౌన్సెలింగ్: పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు విద్యార్థినుల హాస్టళ్లలో 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అదేవిధంగా, ఆడపిల్లల తల్లులకు ప్రమాదాల పట్ల, అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తన పట్ల చైతన్యం తీసుకరానున్నారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్, పునరావాస సహాయాన్ని అందిస్తారు. తాడేపల్లిలోని మహిళా, శిశు సంక్షేమ కార్యాలయం ద్వారా ఐజిపి బి. రాజకుమారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమ అమలును పర్యవేక్షిస్తారు. ప్రతీ జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనర్లు 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని డిజిపి ఆదేశించారు.

Tags

Be the first to react

Latest