రాజకీయాల్లో ఉండకూడని ఉన్మాది! తల్లి,చెల్లి ఆఖరికి మేనకోడలు బలి! చంద్రబాబు ఫైర్!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ వైఎస్సార్సీపీ పాల్పడుతున్న హింసాత్మక ఘటనలు, తప్పుడు ప్రచారాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. 'అదే హింస, అవే అబద్ధాలు, అవే అరాచకాలు' పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 51,902 ఎంపీటీసీ, 5,724 జెడ్పీటీసీ నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలైనప్పటికీ వైకాపా నేతలు కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ క్రిమినల్ లిటిగెంట్లుగా మారారని మండిపడ్డారు. మేనకోడలి పెళ్లిని సైతం అడ్డుకుంటూ జగన్ 'కంస మామ'గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- జగన్ అన్ని విధాలా ఫెయిల్యూర్.. సీఎంగా, పౌరుడిగా, కొడుకుగా, అన్నగా ఎందులోనూ సఫలం కాలేదు!
- మేనకోడలి పెళ్లిని అడ్డుకుంటున్న కంస మామ.. యలహంక ప్యాలెస్ ఇవ్వకుండా ఆస్తి దాహం!
- రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నామినేషన్లు.. 51,902 ఎంపీటీసీ, 5,724 జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలు!
Politics: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్సీపీ పాల్పడుతున్న దాడులు, అరాచకాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా "అదే హింస, అవే అబద్ధాలు, అవే అరాచకాలు" పేరిట రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలను ప్రదర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. జగన్ అన్ని రంగాల్లోనూ విఫలమైన వ్యక్తి అని, ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, విద్యార్థిగా, కొడుకుగా, అన్నగా, చివరకు ఒక పౌరుడిగా కూడా పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను రాజకీయాల్లో ఎంచుకుంటే సమాజానికి భద్రత ఉండదని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.
పంజాబ్ కిరాయి ముఠాలు – హింస సృష్టిస్తున్న నేరమయ రాజకీయాలు
రాష్ట్రంలో తొలి రోజు నుంచే ఎన్నికలను అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, కడప, తంబళ్లపల్లె, తిరుపతి వంటి ప్రాంతాల్లో అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వాహనంతో ఎన్డీఏ కార్యకర్తలను తొక్కించారని, ఆ వాహనంలో మద్యం సీసాలు, మారణాయుధాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. పంజాబ్ నుంచి కిరాయి మూకలను రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు పన్నారని, తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం తగులబడిపోయినా సరే తమ స్వార్థ అజెండా నెగ్గాలనే ఆలోచనతోనే ఆ పార్టీ నేరపూరిత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టులకు తప్పుడు సమాచారం – క్రిమినల్ లిటిగెంట్లుగా వైకాపా
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని, కానీ వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని సీఎం స్పష్టం చేశారు. బాబాయిని హత్య చేసి వేరేవారిపై నెట్టినట్లే, ఇప్పుడు తామే దాడులు చేసి, వాహనాలను దగ్ధం చేసి, తిరిగి తామే బాధితులమంటూ కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు, హైకోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ ఆ పార్టీ నేతలు "క్రిమినల్ లిటిగెంట్లు"గా మారారని విమర్శించారు. కేవలం ప్రెస్మీట్లు పెట్టి అసత్యాలు చెప్పడానికే బెంగళూరు నుంచి అమరావతికి వచ్చి 'హిట్ అండ్ రన్' తరహాలో బురదజల్లి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఏకంగా 24 శాతం బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని, నాటి ఎన్నికల కమిషనర్‌నే బెదిరించి కేంద్ర బలగాల రక్షణ తీసుకునే స్థాయికి దిగజార్చారని గుర్తుచేశారు.
స్వేచ్ఛగా నామినేషన్లు – అభివృద్ధికి సహకరించాలి
గత 2021 స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అరాచకం సృష్టించారని, కానీ కూటమి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందని గణాంకాలతో వెల్లడించారు. 28 జిల్లాల పరిధిలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు గానూ 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 5,724 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. కుప్పం, పిఠాపురం, మంగళగిరితో పాటు పులివెందులలో కూడా స్వేచ్ఛగానే నామినేషన్లు వేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరించిందని తెలిపారు. స్థానిక సంస్థల నిధులు నేరుగా గ్రామాల అభివృద్ధికి చేరాలంటే ఎన్నికలు సజావుగా జరగడం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కుటుంబ బంధాలు లేని కంస మామ – చంద్రబాబు ఆగ్రహం
రాజకీయాల్లో విలువలు లేకపోవడమే కాకుండా, కనీస రక్త సంబంధాలకు కూడా జగన్ విలువ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని రోడ్డుపైకి లాగి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెల్లెలికి వాటా ఉన్న ఆస్తి అయినప్పటికీ, సొంత మేనకోడలి వివాహానికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఇవ్వకుండా అడ్డుకుంటూ 'కంస మామ'లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీబీఐ, ఈడీ కేసులతో పాటు విచ్చలవిడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తుల వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
Be the first to react