విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడ మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలనేది ప్రతి ప్రతిభావంతుడైన విద్యార్థి కల. అయితే, ఒకప్పుడు చాలా సులభంగా అనిపించిన ఈ ప్రక్రియ, 2025లో ఒక పెద్ద సవాలుగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు తమ వీసా నిబంధనలను కఠినతరం చేశాయి. ఈ మార్పులు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు, వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి.
కెనడా: 2025 నుంచి అక్కడి ప్రభుత్వం స్టడీ పర్మిట్లపై దీర్ఘకాల పరిమితిని విధిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా విద్యా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మాస్టర్స్, డాక్టర్ కోర్సుల్లో సీట్లు బాగా తగ్గాయి. అడ్మీషన్ అప్రూవల్ రేట్ బాగా పడిపోయింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికే కెనడా విద్యా సంస్థల్లో చదువుకోవటానికి అవకాశం లభిస్తోంది.
యూకే: ఈ దేశం 2025లో స్టూడెంట్ వీసాల రూల్స్‌లో చాలా మార్పులు చేసింది. గ్రాడ్యూయేట్ రూట్ వీసా గతంలో రెండేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేది. దాన్ని 18 నెలలకు కుదించింది. ఈ నిర్ణయం కారణంగా విద్యార్థులు ఆలోచన్లో పడిపోయారు. వీసాల రుసుము, ఫండ్ రిక్వైర్‌మెంట్ బాగా పెరిగింది.
అమెరికా: చాలా ఏళ్లుగా అమలులో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టాటస్’ విధానానికి అమెరికా ముగింపు పలికింది. మార్పులు చేసిన విధానంతో.. వీసా వాలిడిటీ స్టూడెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్‌తో లింక్ చేయబడింది. బ్యాక్ గ్రౌండ్ చెక్స్, రినివల్ ప్రాసెస్ కఠినతరం అయింది.
2026లో విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి మరిన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కెనడా 2026లో కూడా స్టడీ పర్మిట్ కోటాను కొనసాగించే అవకాశం ఉంది. లేబర్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వర్క్ పర్మీషన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
యూకే ఫైనాన్సియల్ చెక్స్‌ను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. డిపెండెంట్స్, పోస్ట్ స్టడీ వర్క్ రూట్స్‌పై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇక, అమెరికా ఫిక్స్‌డ్ టర్మ్ వీసాలను ప్రమాణీకరించే అవకాశం ఉంది. సెక్యూరిటీ స్క్రీనింగ్ సమయాన్ని పెంచే అవకాశం ఉంది.
విద్యార్థులు ఏం చేయాలి?
మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ వ్యూహాలను మార్చుకోవాలి.
ముందస్తు ప్రణాళిక: వీసా ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పడుతున్నందున, కనీసం ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
ఆర్థిక పారదర్శకత: ఫండ్స్ చూపించేటప్పుడు ఎక్కడా తప్పులు లేకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే ఇప్పుడు చిన్న తప్పు దొరికినా వీసా రిజెక్ట్ అవుతోంది.
ప్రత్యామ్నాయ దేశాలు: కేవలం ఈ మూడు దేశాలకే పరిమితం కాకుండా జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఉన్న అవకాశాలను కూడా పరిశీలించడం మంచిది. విదేశీ విద్య అనేది ఒక పెట్టుబడి వంటిది. మారుతున్న నిబంధనలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.