టీడీపీ స్థానిక నాయకత్వంలో కొత్త తరం.. మహిళలకు పెద్దపీట.. సామాజిక న్యాయానికి ప్రాధాన్యం!

AP TDP Leadership: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నాయకత్వంలో యువత, మహిళలు, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పిస్తూ టీడీపీ సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరతీసిందనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని 27 జిల్లాలకు చెందిన 42 మంది జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల వివరాలను పరిశీలిస్తే నాయకత్వంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వయస్సు, విద్యార్హతలు, మహిళా ప్రాతినిధ్యం, సామాజిక వర్గాల భాగస్వామ్యం వంటి అంశాల్లో ఈ గణాంకాలు ప్రత్యేకతను చాటుతున్నాయి.

TDP AP Leadership 42 ZP Leaders, Women Empowerment and Social Justice
TDP AP Leadership 42 ZP Leaders, Women Empowerment and Social Justice
  • టీడీపీ స్థానిక నాయకత్వంలో 54.8 శాతం మహిళలకు అవకాశం.
  • 42 మంది ప్రజాప్రతినిధుల్లో 69 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే.

AP TDP Leadership: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నాయకత్వంలో యువత, మహిళలు, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పిస్తూ టీడీపీ సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరతీసిందనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని 27 జిల్లాలకు చెందిన 42 మంది జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల వివరాలను పరిశీలిస్తే నాయకత్వంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వయస్సు, విద్యార్హతలు, మహిళా ప్రాతినిధ్యం, సామాజిక వర్గాల భాగస్వామ్యం వంటి అంశాల్లో ఈ గణాంకాలు ప్రత్యేకతను చాటుతున్నాయి.

యువతకు ప్రోత్సాహం.. అనుభవానికి ప్రాధాన్యం

ఈ 42 మంది ప్రజాప్రతినిధుల సగటు వయస్సు 42.5 సంవత్సరాలు. జెడ్పీ చైర్‌పర్సన్ల సగటు వయస్సు 49 ఏళ్లు కాగా, వైస్ చైర్‌పర్సన్ల సగటు వయస్సు 38.5 సంవత్సరాలుగా ఉంది. కర్నూలు జిల్లా వైస్ చైర్‌పర్సన్‌గా 25 ఏళ్ల షేక్ షాదికా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తిరుపతి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా 76 ఏళ్ల హెచ్. హేమలత సేవలందిస్తున్నారు. దీంతో యువత ఉత్సాహం, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం కలగలిసిన నాయకత్వం కనిపిస్తోంది.

విద్యావంతులైన ప్రజాప్రతినిధులు

ఈ నాయకత్వ బృందంలో విద్యార్హతలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మొత్తం 42 మందిలో 31 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. వీరిలో 21 మంది గ్రాడ్యుయేట్లు, 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇద్దరు పీహెచ్‌డీ పట్టభద్రులు కూడా ఉన్నారు. ఎంబీఏ, ఎంటెక్, బీటెక్, ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు స్థానిక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తం నాయకత్వంలో 73.8 శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం.

మహిళా నాయకత్వానికి పెద్దపీట

మహిళా సాధికారత విషయంలోనూ ఈ గణాంకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. 42 మంది ప్రజాప్రతినిధుల్లో 23 మంది మహిళలు ఉన్నారు. అంటే 54.8 శాతం ప్రాతినిధ్యం మహిళలదే. జెడ్పీ చైర్‌పర్సన్లుగా 12 మంది, వైస్ చైర్‌పర్సన్లుగా 11 మంది మహిళలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్థానిక పాలనలో మహిళలకు కేవలం ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీసీలకు అత్యధిక ప్రాతినిధ్యం

సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే బీసీ వర్గానికి చెందిన వారు అత్యధికంగా ఉన్నారు. మొత్తం 42 మందిలో 17 మంది బీసీలు (40.5 శాతం) ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి ఆరుగురు (14.3 శాతం), ఎస్టీ వర్గం నుంచి ముగ్గురు (7.1 శాతం), ముస్లిం మైనారిటీల నుంచి ముగ్గురు (7.1 శాతం), జనరల్ కేటగిరీ నుంచి 13 మంది (31 శాతం) ఉన్నారు.

మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 29 మంది ప్రజాప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. అంటే 69 శాతం ప్రాతినిధ్యం ఆయా వర్గాలకే దక్కింది. బీసీల్లో యాదవ, బోయ, సెట్టిబలిజ, గౌడ, గవర, కురుబ, వడ్డబలిజ తదితర ఉపకులాలకు చోటు లభించింది. ఎస్సీల్లో మాదిగ, మాల వర్గాలతో పాటు ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించారు.

స్థానిక నాయకత్వంలో మార్పునకు సంకేతం

మొత్తం 27 జిల్లాలకు చెందిన 42 మంది జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల వివరాలు పరిశీలిస్తే యువతకు అవకాశాలు, విద్యావంతులకు ప్రోత్సాహం, మహిళలకు కీలక బాధ్యతలు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

సగటున 42.5 ఏళ్ల వయస్సు, 73.8 శాతం విద్యావంతులు, 54.8 శాతం మహిళలు, 69 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం.. ఈ గణాంకాలు స్థానిక సంస్థల్లో నాయకత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిణామాలను టీడీపీ సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యువ నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Tags

Be the first to react

Latest