ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఎస్సీ ఉద్యోగులను మూడు గ్రూపులుగా విభజించి, వారి వర్గీకరణకు అనుగుణంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ సవరణలు 2025 ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఈ తేదీకి ముందే తయారైన ప్రమోషన్ ప్యానెల్స్‌కు ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పదోన్నతుల రిజర్వేషన్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 కేడర్లకు ప్రత్యేక శాతం కేటాయించారు. రిజర్వేషన్ అమలు సమయంలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ ఖాళీలను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసే విధానం అమలు చేస్తారు. అదేవిధంగా మొత్తం ఎస్సీ ఉద్యోగుల ప్రాతినిధ్యం 15% మించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలకు 33 1/3% సమాంతర రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది.
ప్రతి కేడర్‌లో గ్రూప్‌లకు ప్రత్యేక రిజర్వేషన్ శాతం నిర్ణయించారు. గ్రూప్–1కు 1% రిజర్వేషన్, గ్రూప్–2కు 6.5% రిజర్వేషన్, గ్రూప్–3కు 7.5% రిజర్వేషన్ కేటాయించారు. రోస్టర్ పాయింట్ల ప్రకారం వీటిని అమలు చేస్తారు. ఒక ప్యానెల్ సంవత్సరంలో ఆ గ్రూప్‌కు చెందిన అర్హులు లేకపోతే ఆ ఖాళీని తదుపరి సంవత్సరానికి మార్చుతారు. రెండు సంవత్సరాలు అర్హులు దొరకకపోతే నిర్ణయించిన క్రమంలో ఇతర గ్రూపుల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు.
రిజర్వేషన్ అమలు కోసం గ్రూప్‌ల ప్రాతినిధ్యాన్ని విడిగా లెక్కిస్తారు. అయితే మొత్తం ఎస్సీ వర్గానికి 15% ప్రాతినిధ్యం మాత్రమే ఉండేలా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా ఎస్సీ మహిళలకు కూడా సమానంగా రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే దీనికోసం ప్రత్యేక రోస్టర్ పాయింట్లు ఏర్పాటు చేయరని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ఈ సవరణల ద్వారా ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం మరింత పారదర్శకంగా, న్యాయంగా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ అమలుపై ఉద్యోగుల్లో ఉన్న సందేహాలు, సమస్యలు ఈ నిర్ణయంతో తీరనున్నాయని అంచనా. ఈ మార్పులు అమల్లోకి రావడంతో ప్రభుత్వ రంగంలో ఎస్సీ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కలగనున్నది.