భారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పరిమితిని దాటి ఆదాయం పొందే వారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. కానీ కొందరు తమ ఆదాయం పూర్తిగా వెల్లడించకుండా పన్ను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల పరిశీలనలో, ఆదాయం దాచిన వారు లేదా కొన్ని వనరుల్ని ఐటీఆర్‌లో చూపించని వారికి ఐటీ శాఖ నోటీసులు పంపడం ప్రారంభించింది. సెప్టెంబర్ 16తో రిటర్నుల దాఖలు గడువు ముగియడంతో, ఇప్పుడు తప్పులు చేసిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది.
పన్ను చెల్లింపుదారులందరూ అద్దె ఆదాయం, ఇతర వనరుల ఆదాయం, విదేశీ ఆదాయం వంటి అన్ని వివరాల్ని నిర్బంధంగా ప్రకటించాలి. అయితే చాలా మంది ఈ వివరాలను దాచిపెట్టి తప్పుడు రిటర్నులు సమర్పిస్తారు. ఇటీవల ఐటీ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ రకం తప్పులను ముందుగానే గుర్తిస్తోంది. విదేశీ లావాదేవీలు, ఆదాయాలు, ఆస్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, వాటిలో వ్యత్యాసాలను గుర్తించేందుకు డేటా అనాలిసిస్ వాడుతోంది.
దీనికోసం NUDGE అనే ప్రత్యేక ప్రచారాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రారంభించింది. ఈ ప్రచారంలో లక్ష్యంగా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాలు సరిగ్గా ప్రకటించని వారిని గుర్తించి వారికి ముందస్తుగా తెలియజేస్తోంది. SMSలు, ఇమెయిల్‌లు ద్వారా వారు చేసిన పొరపాట్లను వివరించి, జరిమానాలు పడకముందే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది పన్ను చెల్లింపుదారుల్ని స్వచ్చంధంగా సరిదిద్దుకునేలా ప్రోత్సహించే కార్యక్రమం.
విదేశీ అధికార పరిధుల్లోంచి వచ్చిన సమాచారంతో హై-రిస్క్ కేసులను CBDT గుర్తిస్తోంది. వీరికి రెండో దశ నోటీసుల పంపిణీ నవంబర్ 28 నుంచి ప్రారంభం అవుతోంది. తప్పులు సరిచేసుకోవాలంటే, వారికి డిసెంబర్ 31లోగా సవరించిన రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాలు పూర్తిగా ప్రకటించకపోతే జరిమానాలు మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నందున ఈ గడువు కీలకం.
మొదటి దశలో ఇప్పటికే దాదాపు 25,000 మంది నోటీసులు అందుకున్నారు. వారు రివైజ్డ్ రిటర్నులు సమర్పించి రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు, రూ. 1,089.88 కోట్ల విదేశీ ఆదాయాన్ని వెల్లడించారు. పన్ను శాఖ లక్ష్యం తప్పించుకునే వారిని శిక్షించడం కాదు, ముందుగానే హెచ్చరించి, సరైన వివరాలతో రిటర్నులు సమర్పించేలా మార్గనిర్దేశం చేయడం. ఇందుకోసం ఈ కొత్త పద్ధతిని ఐటీ శాఖ దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.