ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తూ, ఇప్పటివరకు 8,22,000 టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,713 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముఖ్యంగా, రైతులు ధాన్యం అమ్మిన 4 నుండి 6 గంటల్లోనే డబ్బు జమ కావడం రైతుల్లో సంతృప్తిని కలిగిస్తోందని మంత్రి నాదెండ్ల తెలిపారు గత ప్రభుత్వంలో ధాన్యం చెల్లింపుల్లో ఆలస్యం ఉండేదని, అయితే ఇప్పుడు లూప్‌హోల్స్ సరిచేసి, మరింత వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,674 కోట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించినట్లు తెలిపారు. వైసీపీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, తాము గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.
రైతులకు మంత్రి ఒక ముఖ్యమైన సూచన కూడా ఇచ్చారు. ఏ పరిస్థితుల్లోనూ మధ్యవర్తులు లేదా దళారులకు ధాన్యం అమ్మొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం 75 కిలోల బస్తాకి రూ.1792 చెల్లిస్తోంది, అంటే కిలోకు రూ.23.89, ఇది దళారుల ధర కంటే ఎక్కువ. కాబట్టి, రైతులు ప్రభుత్వ ధరను ఉపయోగించుకోవాలని సూచించారు.
రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 48 గంటల్లో డబ్బు జమ కాకపోతే, సమస్య చెక్ చేసుకునేందుకు స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు paddyprocurement.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘FTO Search’ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ లేదా ట్రక్ షీట్ నంబర్ వేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. అదనంగా, సమీప RBK కేంద్రంలో గ్రీవెన్స్ ఇవ్వవచ్చు. హెల్ప్‌లైన్ 73373-59375కు కాల్ చేసి సమస్యను చెప్పవచ్చు. ఇవన్నీ రైతుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన చర్యలే.
ఇక వర్షాల హెచ్చరిక కారణంగా, రైతులు త్వరగా ధాన్యం అమ్ముకోవాలని ప్రభుత్వం సూచించింది. దిత్వా తుపాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, పొలాల్లో లేదా రోడ్లపై ధాన్యం ఉండకూడదని సూచించారు. రైతులకు సహాయంగా లక్ష గోనె సంచులు ఉచితంగా అందుబాటులో ఉంచారు. అదనంగా, కేంద్రం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అనుమతి రావడంతో రైతులకు ఇది మంచి అవకాశమని మంత్రి పేర్కొన్నారు.