ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.99.62 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టును ఆమోదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ మోడ్ ద్వారా టెండర్ల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతినిచ్చింది. టెండర్ ప్రక్రియ కొనసాగించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.
కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లిలో వసతుల కల్పన కోసం రూ.1,863 కోట్లకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్లు, ఎస్పీటీ, అవెన్యూ ప్లాంటేషన్ పనుల కోసం టెండర్లను పిలిచేందుకు అనుమతులు ఇచ్చింది.
ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని గ్రామాల్లో వర్షపు నీరు సత్వరం పంపింగ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఉండవల్లి వద్ద మరో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
8,400 క్యూసెక్కుల వరదను కృష్ణా నదిలోకి పంపింగు వీలుగా ప్రాజెక్టు సర్వే, దర్యాప్తు, డిజైన్, నిర్మాణం, పరీక్ష, కమిషనింగ్ కోసం నిధులను మంజూరు చేసింది. రూ. 595 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఏళ్ల పాటు ప్రాజెక్టు కార్యకలాపాలు, నిర్వహణ చేసేలా టెండర్లకు అనుమతి ఇచ్చింది.
రాజధాని అభివృద్ధి కోసం అదనపు రుణం తీసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ద్వారా రూ. 7,500 కోట్ల రుణం తీసుకొనేందుకు సీఆర్డీఏకు అనుమతి, హామీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రుణ ఒప్పందం, హైపోథెకేషన్ డీడ్, అథారిటీ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అమరావతిలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు చేసేందుకు ఈ నిధులను సీఆర్డీఏ వినియోగించనుంది.