విశాఖ నగరం ( Visakhapatnam) కొత్త శోభను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు కోసం నగరం ముస్తాబైంది.
విశాఖలోని ప్రధాన మార్గాలన్నీ విద్యుత్తు దీప కాంతులతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటెన్లు, ఇతర అలంకరణ వస్తువులు కనువిందు చేస్తున్నాయి. విద్యుద్దీపాలలో బీచ్ రోడ్ అంతా మెరుస్తోంది.
భాగస్వామ్య సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల కోసం ఇప్పటికే హోటల్ గదులు సిద్ధం చేశారు. విదేశీ అతిథులు ప్రత్యేకంగా బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాక సూచికగా వైజాగ్లో చివరి G అక్షరం పెద్దగా గూగుల్ ఫాంట్ తో ప్రతి దగ్గర దర్శనమిస్తూ అందరిని అకట్టుకుంటోంది.
ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు తది దశకు వచ్చాయి. 40 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతోపాటు, ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు.
సీఎంతోపాటు గవర్నర్, ఉప రాష్ట్రపతి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సదస్సు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. అతిథులకు నోవాటెల్ హోటల్లో విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, కాన్సుల్ జనరల్స్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖులు, అతిథుల కోసం నగరంలోని 26 హోటళ్లలో 1,200 గదులు సిద్ధం చేశారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు పర్యాటక ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉండడంతో విందు ఏర్పాటు చేసి, అక్కడ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.