శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో తీపికబురు అందించింది. భక్తుల సేవలను మరింత సులభతరం చేయడం, సమాచారాన్ని తక్షణం అందించడం, టెక్నాలజీ ఆధారిత పారదర్శక పాలనను పెంపొందించడం లక్ష్యంగా టీటీడీ పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్ ను త్వరలో భక్తుల సేవలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఈ చాట్‌బాట్ ద్వారా భక్తులు తమకు కావాల్సిన సమాచారం కేవలం కొన్ని సెకండ్లలో పొందగలరు. శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదుల లభ్యత, విరాళాల వివరాలు, ప్రత్యేక సేవల బుకింగ్ వంటి అంశాలను ఈ చాట్‌బాట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. భక్తులు ఇకపై వెబ్‌సైట్‌లలో వెతకాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ చాట్‌బాట్ ద్వారా అవసరమైన వివరాలను పొందగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యం కోసం 13 భాషల్లో ఈ సేవలను అందించనున్నారు.
ఇదే కాకుండా, భక్తులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలు వంటి విషయాలను కూడా ఈ చాట్‌బాట్ ద్వారా టీటీడీ అధికారులకు చేరవేయవచ్చు. చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉండడం వల్ల, భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారానే సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అభివృద్ధి చేస్తోందని సమాచారం.
ఇక టీటీడీ పాలనలో పారదర్శకతను మరింత పెంచడం, భక్తుల సంతృప్తిని పెంచడం దిశగా మరిన్ని సంస్కరణలు అమలు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాల నాణ్యతను పెంపొందించడం, డిజిటల్ సేవలను విస్తరించడం, భక్తుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవల్లో మెరుగుదల చేయడం తదితర అంశాలపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త చాట్‌బాట్ ప్రారంభం టీటీడీ సేవలలో ఒక విప్లవాత్మక మార్పునకు దారితీయనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.