- సమంత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్.. అభిమానుల మద్దతు..
- దర్శకుడు రాజ్ నిడిమోరు రాకతో తన జీవితం మారిపోయిందని వెల్లడి..
Samantha Divorce: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఈ పేరు వింటే ఒకప్పుడు కేవలం గ్లామర్, యాక్టింగ్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, అనారోగ్యం, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఆమెను ఒక 'ఫైటర్'గా మార్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకులు, ఆ తర్వాత ఎదురైన శూన్యం, ఇప్పుడు తన జీవితంలోకి వచ్చిన కొత్త వెలుగు గురించి సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మానసిక స్థితి ఎలా ఉందో ఆమె మొదటిసారి ఇంత వివరంగా చెప్పారు.
ఆ సమయంలో తను పూర్తిగా కుంగిపోయానని, తన చుట్టూ ఒక గోడను నిర్మించుకున్నానని ఆమె తెలిపారు. ఎవరినీ కలవాలని అనిపించేది కాదని, ఇక ఎవరినీ నమ్మకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. "మళ్లీ నా జీవితంలోకి ప్రేమ వస్తుందని, నేను మరొకరిని నమ్మగలనని అస్సలు ఊహించలేదు" అని ఆ రోజలను గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఒక రకంగా ఆ సమయంలో ఆమె ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. క్లిష్ట సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరు (ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ దర్శకుడు) తన జీవితంలోకి రావడం గురించి సమంత చాలా గొప్పగా చెప్పారు.
రాజ్ తన జీవితంలోకి రావడం ఒక అదృష్టమని ఆమె పేర్కొన్నారు. ఆయనతో ఉన్న బంధం కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక గొప్ప స్నేహం అని, ఆ స్నేహం వల్లే తాను మళ్లీ మనిషిగా కోలుకోగలిగానని చెప్పారు. "రాజ్ వల్ల నేను మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారాను. అంతటి సున్నితత్వం, స్నేహం ఉన్న వ్యక్తి దొరకడం వల్ల నాలో మళ్లీ జీవం వచ్చింది" అని ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు. మనిషి లోపల మారినప్పుడు అది బయటి ప్రపంచానికి కూడా కనిపిస్తుంది. సమంత విషయంలోనూ అదే జరిగింది.
కొద్దిరోజుల క్రితం తన పాత స్నేహితురాలు ఒకరు సమంతను కలిసి, ఆ తర్వాత ఒక ఎమోషనల్ వాయిస్ నోట్ పంపారట. "శామ్.. ఇప్పుడే నువ్వు నిజంగా ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వు ఇప్పుడు ఏదీ నటించడం లేదు.. మనస్పూర్తిగా నవ్వుతున్నావు" అని ఆ స్నేహితురాలు చెప్పిన మాటలు సమంతను కదిలించాయి. అంటే గతంలో ఎక్కడో ఒకచోట తను తన బాధను దాచుకుని నటిస్తూ ఉండేదన్నమాట. ఈ ఇంటర్వ్యూ చూసిన ఎవరికైనా ఒక విషయం అర్థమవుతుంది.. సమంత ఇప్పుడు పాత విషయాలను వదిలేసి, తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకుంటున్నారు.
ఎంతటి చేదు అనుభవాలు ఎదురైనా, మళ్లీ ప్రేమను స్వీకరించే గుణం తనలో మిగిలి ఉండటం తన అదృష్టమని ఆమె అనడం గొప్ప విషయం. ఇప్పుడు ఆమె వృత్తిపరంగా 'మా ఇంటి బంగారం', 'రక్త బ్రహ్మాండం' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సమంత జీవితం మనందరికీ ఒక పాఠం నేర్పుతుంది. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, అంతా అయిపోయింది అనుకున్నా.. కచ్చితంగా ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. సమంతలాంటి వారు తమ బాధను ధైర్యంగా పంచుకోవడం వల్ల, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతో మందికి ధైర్యం కలుగుతుంది.