ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురువారం భారత్‌లో తన హోమ్‌పేజీని ప్రత్యేకంగా అలంకరించింది. జీవశాస్త్రంలోని అత్యంత ప్రాధాన్యమైన అంశం డీఎన్ఏ (డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్) కు గౌరవంగా ప్రత్యేక యానిమేటెడ్ డూడుల్‌ను ప్రదర్శించింది. ఈ డూడుల్‌లో జీవనానికి ఆధారం అయిన డీఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఆకర్షణీయంగా చూపిస్తూ, జీవుల ఉనికి, పునరుత్పత్తి, మరియు వారసత్వానికి దాని కీలకతను ప్రతిబింబించింది. ప్రతి జీవి శరీరంలో సూత్రప్రాయమైన మార్గదర్శకంగా ఉండే డీఎన్ఏకి ఈ అంకితం జీవశాస్త్ర ప్రేమికులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
గూగుల్ తన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం — “డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్ అనేది జీవుల పెరుగుదల, పునరుత్పత్తి, మరియు వివిధ జీవక్రియలకు అవసరమైన జన్యుపరమైన సూచనలను కలిగించే మాలిక్యులర్ పాలిమర్. ఇది రెండు గొలుసులు కలిసిన డబుల్ హెలిక్స్‌గా ఉంటుంది” అని పేర్కొంది. ఈ సందర్భంగా గూగుల్ తెలిపినదేమంటే, డీఎన్ఏకు సంబంధించిన సెర్చ్‌లు సాధారణంగా స్కూల్స్ విద్యా సంవత్సరం నడుస్తున్న సమయంలో ఎక్కువగా పెరుగుతాయని, ఇది విద్యార్థులు మరియు పరిశోధకుల ఆసక్తిని ప్రతిబింబిస్తుందని.
డూడుల్‌పై క్లిక్ చేస్తే అది గూగుల్ జెమినీ ఏఐ (Gemini AI) మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ యూజర్లకు ఒక ఆసక్తికర ప్రశ్న అడుగుతుంది — “డీఎన్ఏలోని రసాయన బేస్‌ల క్రమం ఎలా ఉంటుంది?” దీన్నకు సమాధానంగా జెమినీ ఏఐ వివరించేది ఏమంటే, “A ఎల్లప్పుడూ Tతో, C ఎల్లప్పుడూ Gతో జతకడుతుంది. ఈ క్రమం తప్పితే మ్యూటేషన్లు లేదా జన్యు మార్పులు సంభవిస్తాయి” అని. ఇది యూజర్లకు డీఎన్ఏ నిర్మాణాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. ఇలా శాస్త్రీయ జ్ఞానాన్ని సరదాగా నేర్పించడంలో గూగుల్ మరోసారి తన సృజనాత్మకతను నిరూపించింది.
గమనించదగ్గ విషయం ఏమంటే, ఈ డీఎన్ఏ డూడుల్‌ను గూగుల్ తొలిసారిగా సెప్టెంబర్ 10న అమెరికాలో విడుదల చేసింది. ఆ తర్వాత ఇది యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ డూడుల్స్ చరిత్రను పరిశీలిస్తే, 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ “బర్నింగ్ మాన్” ఫెస్టివల్‌కు వెళ్తున్నామని తెలిపే మొదటి డూడుల్‌ను రూపొందించారు. ఆ తర్వాత నుండి పండుగలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, ప్రముఖుల జయంతులు వంటి సందర్భాల్లో డూడుల్స్ గూగుల్ సాంస్కృతిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా 2010లో “ప్యాక్‌మ్యాన్” 30వ వార్షికోత్సవ సందర్భంగా రూపొందించిన ఇంటరాక్టివ్ డూడుల్ అత్యధిక ప్రజాదరణ పొందింది.