ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన భారత దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశానికి స్నేహపూర్వక సంబంధాలు ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు గట్టి స్పందన ఇచ్చారు. ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నెతన్యాహు తన అధికారిక ట్వీట్‌లో భారతదేశానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. భారత్, ఇజ్రాయెల్ రెండు దేశాలు శాశ్వత సత్యాలపై నిలిచిన పురాతన నాగరికతలు. మన నగరాలపై ఎన్ని దాడులు జరిగినా, అవి మన ధైర్యాన్ని దెబ్బతీయలేవు. మన దేశాల వెలుగు, శత్రువుల చీకట్లను తరిమేస్తుంది అని పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్‌ను #IndiaIsraelFriendship అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారత ప్రజలు ఆయన మాటలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అనేక మంది నెటిజన్లు ఇజ్రాయెల్ ఎప్పుడూ భారత్ పక్కనే ఉంటుంది, ఫ్రెండ్స్ ఇన్ వార్ అండ్ పీస్, ధన్యవాదాలు నెతన్యాహు గారు వంటి కామెంట్లు చేస్తున్నారు.
భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు చాలా కాలంగా బలంగా ఉన్నాయి. రక్షణ, వ్యవసాయం, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ రంగాల్లో రెండు దేశాలు పరస్పర సహకారం కొనసాగిస్తున్నాయి. ఇరు దేశాలు ఉగ్రవాదంపై ఎప్పటినుంచో కఠిన వైఖరిని పాటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ పీఎం స్పందించడం, భారత్‌కు తమ మద్దతును పునరుద్ఘాటించడం విశేషం.
నెతన్యాహు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇజ్రాయెల్ భారత్‌ను కేవలం రాజకీయ భాగస్వామిగా కాకుండా, స్నేహ దేశంగా భావిస్తుందని. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటి ఒత్తిడులు, పరిస్థితులు వచ్చినా బలంగా కొనసాగుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.
ఇజ్రాయెల్‌లో కూడా గతంలో ఇలాంటి ఉగ్రదాడులు అనేకం చోటు చేసుకున్నాయి. అందువల్ల ఉగ్రవాదం ఎంత భయానకమో, నిరపరాధుల ప్రాణాలు ఎలా పోతాయో ఆ దేశం బాగా తెలుసు. అందుకే భారత ప్రజల బాధను నెతన్యాహు హృదయపూర్వకంగా పంచుకున్నారు.
భారత విదేశాంగ శాఖ కూడా ఆయన ట్వీట్‌కు స్పందిస్తూ, ఇజ్రాయెల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. “భారత్ ఇజ్రాయెల్ స్నేహం ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలసి పోరాడుతూనే ఉంటాం” అని పేర్కొంది.
ప్రస్తుతం ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తం అవుతుండగా, ఇజ్రాయెల్ పీఎం ఇచ్చిన మద్దతు భారత ప్రజల మనసులను తాకింది. ఉగ్రవాదం ఎంత ప్రయత్నించినా, భారత్ ఇజ్రాయెల్ లాంటి దేశాల ఐక్యతను దెబ్బతీయలేను. నెతన్యాహు చెప్పినట్లే, ఈ రెండు దేశాల వెలుగు ఎప్పటికీ చీకట్లను తరిమేస్తూనే ఉంటుంది.