మచిలీపట్నంలో బందరు పోర్టు (BandarPort), ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని ఆయన భరోసా ఇచ్చారు.
మచిలీపట్నం (Machilipatnam) నియోజకవర్గ పరిధిలో ఒకే రోజున రూ.39 కోట్ల విలువైన ఆర్ అండ్ బీ (R&B) అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం ఆనందకరమని మంత్రి తెలిపారు. చిన్నాపురం–కమ్మవారి చెరువు రోడ్డు విస్తరణకు రూ.33 కోట్లు, కాలేఖాన్‌పేట–చిన్నాపురం రోడ్డు అభివృద్ధికి (Road Development) రూ.6 కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. అదనంగా శారదానగర్ నుంచి కృష్ణా యూనివర్శిటీ మీదుగా చిన్నాపురం వరకు, తాళ్లపాలెం నుంచి నారాయణపురం వరకు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు.
గత ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ నిర్లక్ష్యం వల్ల గుంతలు పెరిగాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టామని మంత్రి వివరించారు. సుమారు రూ.1000 కోట్లతో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చామని తెలిపారు. బందరు పోర్టును డిసెంబరు నాటికి పూర్తి చేసి జిల్లాకు గర్వకారణంగా నిలిపేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పనులపై సమీక్షిస్తామని చెప్పారు.
ఫిషింగ్ హార్బర్ (Fishing Harbour) పనుల విషయంలో గతంలో చోటుచేసుకున్న అవకతవకలను ప్రస్తావించిన మంత్రి, ప్రస్తుతం ఐఐటీ చెన్నై నిపుణులు సూచించిన డిజైన్ల ప్రకారం పనులు చేపడుతున్నామని చెప్పారు. డ్రెడ్జింగ్, భవన నిర్మాణాలను వేగవంతం చేసి, వేట నిషేధం ఎత్తివేసే నాటికి హార్బర్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
ఫిషింగ్ హార్బర్‌కు మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేసిన నడకుదిటి నరసింహరావు పేరు పెట్టడం హర్షణీయమని మంత్రి అన్నారు. 1999లో ఆయన కృషితోనే ఈ హార్బర్ ఏర్పడిందని గుర్తుచేశారు. పోర్టు, హార్బర్, టూరిజం ప్రాజెక్టులను అనుసంధానిస్తూ జిల్లాలో రోడ్ల అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.