ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం (AP Tourism) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతం ఉండటంతో బీచ్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ బీచ్ అత్యంత సురక్షితమైన ప్రదేశమని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, వినోద ఏర్పాట్లతో బీచ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
అలాగే సూర్యలంక బీచ్ (suryalanka beach) వద్ద క్లీన్ బీచ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. సుమారు 15 కిలోమీటర్ల మేర కాలుష్య రహిత ప్రాంతంగా బీచ్ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నారు. శుభ్రత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పర్యాటకులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.
సూర్యలంక బీచ్‌తో పాటు సూళ్లూరుపేట సమీపంలోని చిన్న ద్వీపాల్లోనూ పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ద్వీపాల్లో ఐల్యాండ్ టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి కొత్త పర్యాటక ఆకర్షణగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీచ్ టూరిజం, ఐల్యాండ్ టూరిజం రెండింటినీ సమన్వయంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇప్పటికే స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీకెండ్‌లలో భారీగా వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని, సూర్యలంక బీచ్‌ను దేశంలోనే ప్రముఖ బీచ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నారు.