ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న పింఛన్లను, ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన మైనర్ పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలిస్తూ సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు.
మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాకు వెల్లడించారు.
అమరావతిలో రెండో విడత భూసమీకరణను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ఏడు గ్రామాల్లో భూసమీకరణ చేపడుతున్నట్లు వివరించారు. వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు.
సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిని తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ ద్వారా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ భూయజమానులు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రెండో విడత భూసమీకరణ కింద మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇందులో సుమారు 2,500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని, ఆ భూమిలోనే కొత్త ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. అలాగే సీఆర్డీఏలో 754 కొత్త పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేసేందుకు కూడా ఆమోదం లభించిందని తెలిపారు.