అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణకు కేంద్ర రహదారి, రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూసేకరణ ప్రారంభమవగా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాపై దృష్టి పెట్టారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి.
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల్లో ఉన్న 18 గ్రామాల్లో భూమిని సేకరించనున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 1,416.31 హెక్టార్ల విస్తీర్ణంలో భూసేకరణ జరగనుంది. ఇందుకోసం 1,798 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న భూమిని అధికారులు గుర్తించారు.
భూసేకరణపై ప్రజలకు తమ అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కూడా కల్పించారు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోపు ఎవరైనా తమ అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు రాతపూర్వకంగా సమర్పించవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత నేషనల్ హైవేస్ యాక్ట్–1956 ప్రకారం తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడికొండ, తెనాలి, వట్టిచెరుకూరు తదితర మండలాల్లో 2,342.87 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు వంటి మండలాల్లో 1,111.71 హెక్టార్ల భూమి భూసేకరణలో ఉంది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం మూడు జిల్లాల్లో కలిపి 4,870.89 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు అమరావతి ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.