ఏడాదిలోనే కొత్త కొత్త వెర్షన్లు, ఆధునిక టెక్నాలజీలు, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌లతో కొత్త ల్యాప్‌టాప్‌లు మార్కెట్లోకి వచ్చి భిన్నమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.టెక్నాలజీ వేగంగా మారిపోతుండటంతో చాలా మంది పాత ల్యాప్‌టాప్‌లు, పీసీలను అమ్మేసి కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా పాత డివైజ్‌ను విక్రయించే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ల్యాప్‌టాప్ లేదా పీసీలో వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, ఈమెయిల్ అకౌంట్లు, సోషల్ మీడియా లాగిన్ వివరాలు వంటి అనేక కీలక డేటా ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది. కేవలం ఫైళ్లు డిలీట్ చేయడం సరిపోదని, పూర్తి స్థాయిలో డేటాను సురక్షితంగా తొలగించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పాత ల్యాప్‌టాప్ అమ్మే ముందు మొదటగా డేటా బ్యాకప్ తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
డేటా బ్యాకప్ అంటే ల్యాప్‌టాప్‌లో ఉన్న అన్ని ముఖ్యమైన ఫైళ్లను మరో సురక్షితమైన చోట భద్రపరచడం. పెన్‌డ్రైవ్, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ లేదా క్లౌడ్ స్టోరేజ్ సేవలలో ఈ డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల డివైజ్ విక్రయించిన తర్వాత కూడా మన సమాచారం మన దగ్గరే సురక్షితంగా ఉంటుంది. బ్యాకప్ పూర్తయిన తర్వాత మాత్రమే తదుపరి స్టెప్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక చాలా మంది డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌లను పాత ల్యాప్‌టాప్‌లోనే వదిలేస్తుంటారు. ఇది కూడా పెద్ద తప్పే. అడోబీ, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్‌వేర్‌లకు లైసెన్స్ పరిమితి ఉంటుంది. పాత సిస్టమ్‌లో అవి యాక్టివ్‌గా ఉంటే కొత్త సిస్టమ్‌లో వాడలేని పరిస్థితి వస్తుంది. అందుకే ల్యాప్‌టాప్ అమ్మే ముందు ఆ సాఫ్ట్‌వేర్‌లను డీయాక్టివేట్ చేసి, కొత్త డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం చాలా అవసరం.
డేటా బ్యాకప్, సాఫ్ట్‌వేర్ ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యాక పాత ల్యాప్‌టాప్‌ను పూర్తిగా క్లీన్ చేయాలి. సాధారణంగా ఫైళ్లను డిలీట్ చేయడం సరిపోదు. ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా హార్డ్‌డిస్క్‌లో ఉన్న డేటా మొత్తం తొలగిపోతుంది. దీని వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉండదు. అవసరమైతే ప్రత్యేక డేటా వైపింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి పూర్తిగా డేటాను తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో పాత ల్యాప్‌టాప్ పూర్తిగా పనికిరాకుండా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని అమ్మడం కంటే రీసైక్లింగ్‌కు ఇవ్వడమే మంచిదని చెబుతున్నారు. అనేక ఎలక్ట్రానిక్ స్టోర్లు, సర్వీస్ సెంటర్లు ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుంది. అలాగే ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సక్రమంగా నిర్వీర్యం అవుతాయి.
పాత ల్యాప్‌టాప్ లేదా పీసీని విక్రయించే ముందు కాస్త జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు ఏర్పడవని నిపుణులు చెబుతున్నారు. డేటా భద్రత, సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.