ఆధార్ కార్డు ఇప్పుడు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదు… ప్రతి భారతీయుడి నిత్యావసర డాక్యుమెంట్‌గా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి ప్రభుత్వ పథకాలు, సిమ్ కార్డు, ప్రయాణాలు, ఉద్యోగ ప్రక్రియల వరకు అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయింది. ఎప్పుడు ఎక్కడ అవసరం పడుతుందో తెలియకపోవడంతో చాలా మంది తమ వ్యాలెట్ లేదా జేబుల్లో ఆధార్ కార్డును ఎప్పుడూ వెంట తీసుకువెళ్తుంటారు. అయితే కార్డు పోయే ప్రమాదం, దుర్వినియోగం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు యూఐడీఏఐ (UIDAI) ఆధార్‌ను డిజిటల్ రూపంలో మరింత సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
డిజిటల్ ఆధార్‌ను ఇప్పటివరకు UIDAI వెబ్‌సైట్, mAadhaar యాప్, డిజిలాకర్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. తాజాగా దీనికి మరో సౌకర్యాన్ని జోడించింది UIDAI. ఇప్పుడు వాట్సప్ ద్వారా కూడా ఆధార్‌ను నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే రోజూ కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సప్‌ను ఆధార్ సేవలతో అనుసంధానం చేయడం వల్ల, సాధారణ ప్రజలకు ఇది ఎంతో సౌకర్యంగా మారనుంది. ప్రత్యేకంగా ఇంటర్నెట్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికీ ఈ విధానం ఉపయోగకరంగా ఉండనుంది.
వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం. ముందుగా మీ మొబైల్‌లో 9013151515 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. వెంటనే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. అందులో డిజిలాకర్ (DigiLocker) ఆప్షన్‌ను ఎంచుకుని, మీ డిజిలాకర్ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఆధార్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన OTPని వెరిఫై చేయాలి. అనంతరం డిజిలాకర్‌లో భద్రపరిచిన డాక్యుమెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఆధార్‌ను ఎంచుకుంటే, పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఆధార్ కార్డు నేరుగా వాట్సప్‌లోకి వస్తుంది.
అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది. ముందుగానే డిజిలాకర్‌లో మీ ఆధార్ కార్డును లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకుండా ఉంటే వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి ఆధార్‌ను లింక్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ఇలా లింక్ చేసి ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో సెకన్ల వ్యవధిలోనే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఈ వాట్సప్ సౌకర్యంతో ఆధార్ సేవలు మరింత వేగంగా, సులభంగా, ప్రజలకు దగ్గరయ్యాయని చెప్పవచ్చు.