ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (Artificial Intelligence – AI) విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. ఉద్యోగ రంగం నుంచి పరిశోధనల వరకు, విద్య నుంచి పాలన వరకు అన్ని రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. అమరావతి రాజధానిని కేంద్రంగా చేసుకుని దేశంలోనే తొలి ఏఐ యూనివర్శిటీని ప్రారంభించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఏఐ విద్య, పరిశోధనలు, ఇన్నోవేషన్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ప్రపంచ ప్రఖ్యాత ఏఐ దిగ్గజ సంస్థ ఎన్విడియా (NVIDIA) సహకారంతో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే నెల 19న అమరావతిలో ఈ ఏఐ యూనివర్శిటీ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్విడియాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, మొదటి రెండు సంవత్సరాల్లోనే దాదాపు 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇది రాష్ట్ర యువతకు గ్లోబల్ స్థాయి నైపుణ్యాలను అందించడంలో కీలకంగా మారనుంది.
కేవలం విద్యకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో ఇప్పటికే ఏఐ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్స్‌కు ఈ యూనివర్శిటీ బలమైన మద్దతు ఇవ్వనుంది. సాంకేతిక మార్గదర్శకత్వం, పరిశోధనా సహకారం, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం, పెట్టుబడిదారులతో నెట్‌వర్కింగ్ వంటి అవకాశాలను స్టార్టప్స్‌కు అందించనుంది. మొదటి దశలో దాదాపు 500 ఏఐ స్టార్టప్స్‌కు ఈ యూనివర్శిటీ ద్వారా ప్రయోజనం కలగనుంది. భవిష్యత్‌లో ఈ సంఖ్యను మరింతగా పెంచుతూ, అమరావతిని ఏఐ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఈ ఏఐ విశ్వవిద్యాలయం పూర్తిగా ఎన్విడియా సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పాలన, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో ఏఐ వాస్తవ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఎన్విడియా ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని టైర్-2, టైర్-3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీని ద్వారా ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి ట్రెండింగ్ కోర్సులను రాష్ట్రంలోనే చదివి, గ్లోబల్ అవకాశాలను అందుకునే దిశగా ఏపీ యువత ముందడుగు వేయనుంది.