తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఉచిత దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో క్యూలైన్లు పొడవుగా కొనసాగుతున్నాయి.
ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు లైన్‌లో నిలబడి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 20 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.అదే సమయంలో రూ.300 శీఘ్ర దర్శనానికి వెళ్లే భక్తులకు కొంత ఉపశమనం లభిస్తోంది. శీఘ్ర దర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునేందుకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది.
నిన్న ఒక్కరోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 82,022కి చేరుకుంది. అలాగే 20,230 మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారికి తలనీలాలు సమర్పించారు.భక్తుల విరాళాలతో స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. నిన్న ఒక్కరోజులో హుండీ ద్వారా రూ.3.48 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.