2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో చైనా పౌరులకు పర్యాటక వీసాలపై భారత్ ఆంక్షలు విధించింది. అయితే తాజాగా చైనా వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించడంతో, ఇరు దేశాల మధ్య జరిగిన అనేక స్థాయిల చర్చలు సత్ఫలితాలు ఇవ్వడంతో భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24 నుంచి చైనా పర్యాటకులకు తిరిగి వీసాల మంజూరు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
దౌత్య సంబంధాల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన నేపథ్యంలో, ఇది భారత్ నుంచి వచ్చిన పాజిటివ్ సిగ్నల్‌గా పరిశీలిస్తున్నారు. గాల్వన్ ఘటన అనంతరం చైనా పెట్టుబడులపై, యాప్‌లపై భారత్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే 2022 నుంచే చైనా భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వీసాలు జారీ చేస్తోంది. కానీ భారత్ మాత్రం పర్యాటక వీసాలను నిలిపి వేసింది.
తాజా నిర్ణయాన్ని చైనా హర్షాతిరేకాలతో స్వాగతించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ద్వైపాక్షిక చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమని తెలిపారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశాలు సానుకూల దిశగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే 3,800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడంతో, సంబంధాల పునరుద్ధరణకు సమగ్ర చర్చలు అవసరమని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.