కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. గ్రామ పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో మాయపట్నం గ్రామంలోని అనేక ఇళ్లు నీట మునిగినట్టు అధికారులు నివేదించారు. ఈ మేరకు ప్రజలకు తక్షణ సహాయ చర్యలు అందించాలంటూ కలెక్టర్‌కు పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు అవసరమైన ఆహారం, పాలు, మంచినీరు వెంటనే అందించాలన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య బృందాలు, ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తీర రక్షణ కోసం గతంలో చేపట్టిన నిర్మాణాలు, రక్షణ గోడ, జియో ట్యూబ్స్ పై వివరాలు తీసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. "ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.