2025 ఆగస్టు 1వ తేదీ నుంచి UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) సేవలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భారీ మార్పులను తీసుకురానుంది. ఈ కొత్త నియమాలు PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్‌లను ఉపయోగించే వినియోగదారులందరినీ ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా ఈ మార్పులు డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేయడం, భద్రతను మెరుగుపరచడం, సర్వర్‌పై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా రూపొందించబడ్డాయి.
ప్రధానంగా, ఇప్పుడు ఒక వినియోగదారు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేయగలుగుతారు. అలాగే, ఒకే మొబైల్ నంబరుకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయడం వీలవుతుంది. ఇదే విధంగా, ఆటోపే లావాదేవీలు (ఉదా: OTT సబ్‌స్క్రిప్షన్లు, మ్యూచువల్ ఫండ్ కట్టుదలలు) ఇకపై రోజు మూడుసార్లు మాత్రమే ప్రాసెస్ అవుతాయి – ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే.
ఇంకా, ఒక లావాదేవీ విఫలమైనప్పుడు దాని స్థితిని రోజుకు గరిష్టంగా మూడు సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు, అదే సమయంలో చెక్స్ మధ్య 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి. చెల్లింపులకు ముందు రిసీవర్ యొక్క బ్యాంక్ పేరు చూపించే విధానం ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఇది తప్పు ఖాతాలకు చెల్లింపులను నివారించడంలో, మోసాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చివరిగా, పేమెంట్ రివర్సల్ లేదా ఛార్జ్‌బ్యాక్‌కి కూడా పరిమితులు విధించారు. ఒక వినియోగదారు నెలకు గరిష్టంగా 10 ఛార్జ్‌బ్యాక్స్ మాత్రమే అడగవచ్చు. అదే వ్యక్తి లేదా సంస్థ నుంచి ఐదు సార్లు మాత్రమే రివర్సల్‌కు అవకాశం ఉంటుంది. ఈ మార్పులన్నింటితో పాటు, UPI యాప్‌లు, బ్యాంకులు API పనితీరు పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని NPCI సూచించింది. ఈ మార్పులన్నీ డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా, వేగంగా, సమర్థవంతంగా మార్చే దిశగా చేపట్టిన చర్యలుగా చెప్పొచ్చు.