ఇరాన్‌పై సైనిక దాడిని అమెరికా చివరి నిమిషంలో వాయిదా
ఇజ్రాయెల్ సహా పలు దేశాల ఒత్తిడితో వెనక్కి తగ్గిన ట్రంప్
ఇరాన్‌తో దౌత్య చర్చలకు పుతిన్ మధ్యవర్తిత్వం
ఇరాన్‌పై సైనిక దాడి చేసే అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో దాడి తప్పదన్న స్థితి నుంచి, ప్రస్తుతానికి సైనిక చర్య అవసరం లేదన్న దశకు అమెరికా చేరుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఖతార్, యూఏఈ వంటి పలు దేశాలు దాడి వద్దని కోరడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంతేకాదు, ఇరాన్‌లో నిరసనకారులకు సామూహికంగా ఉరిశిక్షలు విధించే అంశంలో తేహరాన్ వెనక్కి తగ్గడం కూడా అమెరికా వైఖరిపై ప్రభావం చూపింది.
ఇరాన్‌పై దాడి చేస్తే భారీగా ఆయుధ సంపత్తి, నిధులు అవసరమవుతాయని, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై ప్రతిదాడులు జరిగే ప్రమాదం ఉందని నెతన్యాహు ట్రంప్‌కు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దౌత్యపరమైన మార్గాల ద్వారా ఒత్తిడి పెంచాలని పలు దేశాలు సూచించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడినట్లు తెలిపారు. నిరసనకారులకు ఉరిశిక్షలు విధించబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో దౌత్య పరిష్కారంపై ఆశాభావం వ్యక్తమైంది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో వేర్వేరుగా చర్చలు జరిపిన పుతిన్, శాంతియుత పరిష్కారానికి రాజకీయ, దౌత్య మార్గాలే సరైనవని స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే మరోవైపు, ఇరాన్ అధికారిక మీడియా ట్రంప్‌ను హెచ్చరిస్తూ రెచ్చగొట్టే దృశ్యాలు (provocative visuals) ప్రసారం చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.