మన భారతీయ వంటకాల్లో టమాటా లేనిదే ఏ కూర పూర్తి కాదు. అందుకే మనం మార్కెట్‌కు వెళ్ళినప్పుడు కిలోల కొద్దీ టమాటాలను తెచ్చుకుని, అవి పాడవకూడదని వెంటనే ఫ్రిజ్‌లో కుక్కేస్తుంటాం. నిజానికి, ఇలా చేయడం వల్ల మనం టమాటాలోని అసలైన రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషకాలను కూడా కోల్పోతున్నామని మీకు తెలుసా?
పండని టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టవచ్చా.?
చాలామంది మార్కెట్ నుంచి కొంచెం పచ్చగా లేదా గట్టిగా ఉన్న టమాటాలను తెచ్చి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. టమాటాలు సహజంగా పండడానికి మితమైన వేడి, గాలి అవసరం. ఫ్రిజ్‌లో ఉండే చల్లని ఉష్ణోగ్రత టమాటా పండే ప్రక్రియను (Ripening Process) ఆపేస్తుంది. ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన టమాటాలు పండకపోగా, వాటిలోని సహజమైన రుచి తగ్గిపోయి చప్పగా తయారవుతాయి. వాటికి ఉండాల్సిన ప్రత్యేకమైన వాసన కూడా మాయమవుతుంది. పండని టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద, నేరుగా ఎండ తగలకుండా పక్కన పెడితే అవి సహజంగా, రుచిగా పండుతాయి.
ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు ..?
టమాటాలను వారం కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి హానికరం. బయటకి చూడటానికి బాగానే ఉన్నా, వారం దాటిన టమాటాలు లోపలి నుండి కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. దీనిని మనం గమనించకుండా కూరల్లో వేస్తే జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో ఉండే అధిక తేమ వల్ల టమాటాల తొడిమల వద్ద మనకు తెలియకుండానే నల్లటి బూజు చేరుతుంది. ఇవి విషపూరితమైన బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి.
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.?
పాడైపోయిన లేదా ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉన్న టమాటాలను తింటే కలిగే నష్టాలు.. వికారం, వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు ఇటువంటి టమాటాలు తింటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. నిల్వ ఉన్న టమాటాల్లో పెరిగే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.
టమాటాలు తాజాగా ఉంచుకోవడానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా.?
మీ ఆరోగ్యం మరియు వంటల రుచి పెరగాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. వారానికి సరిపడా ఒకేసారి కాకుండా, రెండు మూడు రోజులకు ఒకసారి తాజాగా కొనుక్కోవడం ఉత్తమం. ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే, వాటిని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, ఫ్రిజ్‌లో కింద ఉండే వెజిటబుల్ డ్రాయర్‌లో విడిగా ఉంచండి. కూరలో వేసే ముందు టమాటా లోపల నల్లగా ఉన్నా లేదా కొంచెం తేడా వాసన వస్తున్నా మొహమాటపడకుండా పడేయండి.