ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, సాంకేతిక, మానవ వనరులను సమీకరించడంతో పాటు రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు పర్యాటక అభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో శ్రీ కొమటి జయరాం గారిని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పొలిటికల్-సీ) శాఖ ద్వారా జనవరి 8, 2026న ప్రభుత్వ ఉత్తర్వులు (GO 2026 GAD 39862) జారీ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కొమటి జయరాం ఉత్తర అమెరికా ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తక్షణమే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారు.
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రుల సహకారంతో రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నియామకం కీలకంగా ఉపయోగపడనుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడులు, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి ఆకర్షించే దిశగా ప్రత్యేక ప్రతినిధి పాత్ర ముఖ్యమైనదిగా వీరు భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో ఉత్తర అమెరికాలో రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఈ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. మళ్ళీ ఈ పదవి కోమటి జయరాం గారికి దక్కడంతో ఉత్తర అమెరికా ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత 3 దశాబ్దాలుగా కోమటి జయరాం గారు అమెరికా లో పలు ప్రతిష్టాత్మక అసోసియేషన్ లలో సేవలు అందించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సాంస్కృతిక సంస్థలలో ఒకటైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA)కు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి, సంఘాన్ని మరింత బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
TANA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొమటి జయరాం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, యువతను సంఘ కార్యకలాపాల వైపు ఆకర్షించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారిలో ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం.
కొమటి జయరాం నాయకత్వ శైలి, సేవాభావం వల్ల ఆయనకు ప్రవాస తెలుగు సమాజంలో విశేష ఆదరణ లభించింది. తానా మాజీ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన ప్రవాస ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
అలాగే, స్వాగత్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్‌కు ఛైర్మన్ మరియు ప్రెసిడెంట్‌గా, అలాగే లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ట్రస్టీగా, 2002–2003 కాలంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండో-అమెరికన్స్ (FIA) ఛైర్మన్‌గా ఉన్న కొమటి జయరాం గారు, తెలుగు సంస్కృతి, భాష, సంప్రదాయాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించడంలో విశేష సేవలందించారు.
ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి గా నియామితులు అయిన కోమటి జయరాం గారికి "ఆంధ్రప్రవాసి" తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాము.