సాధారణంగా జనవరి నెల అంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, తెల్లవారుజామున మంచు కురిసే చలి వాతావరణం ఉంటుంది. కానీ, ఈ ఏడాది (2026) వాతావరణం అనూహ్యంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం ముఖ్యంగా తమిళనాడు, కేరళపై ఎక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ జిల్లాలపై కూడా దీని నీడ పడింది.
వాయుగుండం ప్రస్తుత పరిస్థితి ఏమిటి.?
జనవరి 5న నైరుతి బంగాళాఖాతంలో ప్రారంభమైన ఆవర్తనం, క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఈ తీవ్ర వాయుగుండం నేడు (శనివారం) మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలి - జాఫ్నా మధ్య దాటే అవకాశం ఉంది. జనవరి మాసంలో బంగాళాఖాతంలో ఇంతటి తీవ్రమైన వాయుగుండం ఏర్పడటం 135 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది అత్యంత అరుదైన 'జనవరి సైక్లోనిక్ డిస్టర్బెన్స్'గా రికార్డులకు ఎక్కింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవి.?
తీవ్ర వాయుగుండం శ్రీలంక వైపు వెళ్తున్నప్పటికీ, దాని బాహ్య వలయాల ప్రభావంతో ఏపీలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, మదనపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వంటి రేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
ఏ రాష్ట్రాల్లో రెడ్/ఆరెంజ్ అలర్ట్..?
ఫలితంగా తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. జనవరిలో తీవ్ర వాయుగుండం, తుఫాన్ ను తమిళనాడు ఎదుర్కొంటోండటం 135 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. డెల్టా ప్రాంతం, కోస్తా, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నాడు రామనాథపురం, పుదుక్కోటై, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం జిల్లాలతో పాటు కారైకల్ ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
నాగపట్టణం, తిరువారూర్, కారైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రామనాథపురం, తంజావూరు, మైలాడుతురై, పుదుక్కోట, కడలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వీటితో పాటు శని, ఆాదివారాల్లో అరియలూర్, విల్లుపురం, కాల్లకురిచి, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం వరకూ వర్షాలు కొనసాగుతాయి. ఈ తడి వాతావరణం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావంతో కేరళ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాసర్ గాడ్, కన్నూర్, ఇడుక్కి జిల్లాలపై దీని ప్రభావం ఉంది. ఇడుక్కి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అలాగే- తమిళనాడును ఆనుకుని ఉన్న ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలపైనా వర్షాల పడనున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.