దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాలలో ఆయుష్మాన్ భారత్ ఒకటి. రేషన్ కార్డు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందుతోంది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అంతేకాకుండా, వయో వృద్ధుల ఆరోగ్య భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ 70 ఏళ్లు దాటిన వారికి అదనపు వైద్య కవరేజీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అదనపు లిమిట్ విషయంలో ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు, అయోమయాలు నెలకొనడంతో కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది.
2024 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, కుటుంబ ఆదాయం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉన్న 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు మరో రూ.5 లక్షల అదనపు వైద్య కవరేజీ కల్పించారు. దీని ద్వారా వృద్ధులకు మొత్తం రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తోంది. అయితే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది వయో వృద్ధులు ఉంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున వస్తాయా? లేదా కుటుంబానికి మొత్తంగా రూ.15 లక్షల వరకు కవరేజీ ఉంటుందా? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నప్పుడు ఈ అయోమయం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ‘వయ వందన’ పథకం కింద ఇచ్చే అదనపు రూ.5 లక్షల వైద్య కవరేజీ కేవలం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వర్తిస్తుందని, కానీ ఒక్కో వృద్ధునికి విడిగా కవరేజీ ఇచ్చే విధానం కాదని తెలిపింది. అంటే కుటుంబానికి ఇప్పటికే ఉన్న రూ.5 లక్షల ఆయుష్మాన్ భారత్ కవరేజీకి అదనంగా, అర్హత కలిగిన వయో వృద్ధుల కోసం మరో రూ.5 లక్షల కవరేజీ మాత్రమే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మిగతా కుటుంబ సభ్యులందరికీ పాత విధానం ప్రకారమే రూ.5 లక్షల లిమిట్ వర్తిస్తుందని వెల్లడించింది.
ఈ పథకం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా అధికారిక సమాచారం కోసం ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌ను సందర్శించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక మార్గాల్లోనే వివరాలు తెలుసుకోవాలని కోరింది. ఈ స్పష్టతతో ఆయుష్మాన్ భారత్ పథకంపై నెలకొన్న అయోమయానికి తెరపడింది. ముఖ్యంగా వయో వృద్ధులకు అదనపు వైద్య భద్రత కల్పించే ఈ నిర్ణయం వల్ల పెద్ద చికిత్సల ఖర్చుల నుంచి వారికి భారీ ఉపశమనం లభించనుంది. ఆరోగ్య భద్రత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు పేద, వృద్ధ వర్గాలకు మరింత భరోసానిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పథకం ద్వారా ఏ రకాల చికిత్సలు ఉచితంగా పొందవచ్చు? ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఆస్పత్రిలో చేరే చికిత్సలు (సర్జరీలు, ఐసీయూ, పరీక్షలు, మందులు) పూర్తిగా ఉచితం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం లభిస్తుంది.