అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భద్రతా వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హత్య విషయంలో కొందరు తేలికపాటి వ్యాఖ్యలు చేయడం పట్ల గట్టిగా స్పందించిన సీఎం, “బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయం అయ్యితే… పరకామణి పెద్ద విషయం ఎలా అవుతుంది? నైతికతలేనివాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం తప్పు అని ఆయన స్పష్టం చేశారు.
టీటీడీలో జరిగిన అక్రమాలపై సీఎం మరింత తీవ్రంగా స్పందించారు. రూ.70 వేలు విలువైన వస్తువు దొంగతనం కేసులో రూ.14 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిన పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ, “టీటీడీలో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో దీనిబట్టే అర్థమవుతోంది” అని విమర్శించారు. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయని, అయితే వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ‘లేడీ డాన్స్’ వంటి షాకింగ్ ఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్ర శాంతిభద్రతల దిగజార్పును తెలిపే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీకి తావులేదని ఆయన స్పష్టం చేశారు. “శాంతిభద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. అన్నీ అదుపులో పెడుతున్నాం” అని సీఎం తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పునఃప్రారంభం కావడంతో రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. రాజధాని అభివృద్ధిని చూసి రాజకీయంగా కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తాయని సీఎం హెచ్చరించారు.
హైదరాబాద్‌లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని నేటి పాలకులు కూడా అంగీకరిస్తున్నారని సీఎం గుర్తుచేశారు. “మా పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి బలమైన పునాది పడింది. అందుకే ఇవాళ కోకాపేటలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది” అని తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు కాదని… ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రం ముందుకెళ్లాలంటే అభివృద్ధి-పారదర్శకత-శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి అని సీఎం చంద్రబాబు తెలిపారు.