ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదవీ విరమణ ప్రయోజనాలు (Retirement Benefits), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ప్రక్రియలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఆర్థిక శాఖ చేపడుతున్న చర్యలను ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలతో స్వాగతించాయి. డిజిటలైజేషన్ ద్వారా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎదురవుతున్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విధానాన్ని అమలు చేసే సమయంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా, పాత విధానంలోని సమస్యలు మళ్లీ తలెత్తకుండా పకడ్బందీగా రూపొందించాలని ఉద్యోగ సంఘాల నాయకులు సూచించారు.
శుక్రవారం ఆర్థిక శాఖ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ (RBC), జీపీఎఫ్ డిజిటలైజేషన్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొత్త విధానం ద్వారా పదవీ విరమణ తర్వాత రావాల్సిన డబ్బులు, జీపీఎఫ్ ఖాతా వివరాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పెన్షనర్లకు ఎంతో ఉపశమనంగా మారేలా వార్షిక ధృవీకరణ (Life Certificate) ప్రక్రియను మొబైల్ ద్వారా ఇంటి నుంచే చేసుకునే సౌకర్యం కల్పించడంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ఉద్యోగులు తమ కార్యాలయంలో ఒకే కామన్ అప్లికేషన్ ఫారం నింపితే చాలు. ఆ ఫారం నేరుగా అకౌంటెంట్ జనరల్ (AG) కార్యాలయానికి చేరుకుని, మొత్తం ప్రక్రియ అక్కడే పూర్తవుతుంది. దరఖాస్తు ఎక్కడ వరకు ప్రాసెస్‌లో ఉందో ఉద్యోగులు, పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్‌లోనే ట్రాక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం పూర్తిగా తగ్గనుంది.
పెన్షన్ మంజూరులో ఆలస్యం, చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు వంటి అంశాలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగాన్ని కూడా ఈ పోర్టల్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానంలో ఆలస్యాలు, పత్రాల గందరగోళం, చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కొత్త డిజిటలైజ్డ్ విధానం వల్ల ఆ సమస్యలన్నింటికీ ముగింపు పలకగలమని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం అభినందనీయమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.