అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-రష్యాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యాతో ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విధానాలతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత దిగజారతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రూత్ సోషల్ వేదికగా మరోసారి భారత్-రష్యాల వ్యాపారంపై స్పందించారు.
భారత్ అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తోందని, అందుకే న్యూఢిల్లితో అమెరికా తక్కువగా వాణిజ్యం చేస్తోందని ట్రంప్ అన్నారు. అలాగే రష్యాతో అమెరికా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం లేదని తేల్చి చెప్పారు.
ఇప్పటికే భారత్ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించినట్లు గుర్తుచేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాషింగ్టన్ తనతో ఆటలు ఆడుతోందని మెద్వెదేవ్ చెబుతున్నాడు.. బహుశా ఇంకా తానే రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడనుకుంటున్నాడేమో!’’ అంటూ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు.